
న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనం మరింతగా కొనసాగుతుందని, వచ్చే పదేళ్లలో ఏకంగా 100కి కూడా పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టరు మార్క్ ఫేబర్ అంచనా వేశారు. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుత రూపాయి పతనానికి ఇతర ఆసియా కరెన్సీల క్షీణతతో పాటు భారత ద్రవ్య పరపతి విధానం కూడా కారణమని ఆయన చెప్పారు. భారత్‌లో కఠినతర పరపతి విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చాలా మంది.. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన వారు.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను విమర్శిస్తుంటారని ఫేబర్ తెలిపారు
‘‘కానీ డాలర్–రూపాయిని స్థిరీ కరించిన రాజన్‌ను నేను ప్రశంసించా. భారత స్టాక్స్ విలువలు ప్రస్తుతం చాలా ఖరీదుగా ఉన్నా యి. వచ్చే ఏడాది వ్యవధి.. ఆ పై కాలంలో మార్కెట్ కరెక్షన్‌కు లోనుకావొచ్చు. పలు స్టాక్స్ తమ ఆదాయాలకు 50 రెట్లు అధిక స్థాయిలో ట్రేడవుతున్నాయి. అందుకని వచ్చే ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలో మార్కె ట్లు మరింతగా పెరగడం కన్నా, తగ్గే అవకాశాలే ఉన్నాయి’’ అని ఫేబర్ వివరించారు.