కేజీ డి–6లో రూ.26,000 కోట్ల పెట్టుబడులు

RIL-BP to develop three gas fields - Sakshi

మూడు గ్యాస్‌ క్షేత్రాలను అభివృద్ధి చేయనున్న ఆర్‌ఐఎల్‌–బీపీ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటిష్‌ పెట్రోలియం ( బీపీ)సంయుక్తంగా కేజీ డి–6 బ్లాక్‌ పరిధిలో 4బిలియన్‌ డాలర్లు (రూ.26,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) అధ్యక్షతన గల మేనేజింగ్‌ కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. తూర్పు తీరంలో ఇవి ఇన్వెస్ట్‌ చేయనున్నాయని, వీటితో 20 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ అదనంగా అందుబాటులోకి వస్తుందని డీజీహెచ్‌  ప్రకటన తెలిపింది.

కేజీ డి–6కు ఆర్‌ఐఎల్‌ ఆపరేటర్‌కాగా, బ్రిటన్‌కు చెందిన బీపీకి 30%, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్‌కు 10% వాటాలు కలిగి ఉన్నాయి. మరోవైపు ఎంజే, ఆరు శాటిలైట్‌ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు కూడా ఆమోదం లభించింది. కేజీ డి–6 పరిధిలో ఉత్పత్తిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రూ.40,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ఆర్‌ఐఎల్, బీపీ గతేడాది జూన్‌లో ప్రకటించాయి. 2020–22 నాటికి రోజువారీ ఉత్పత్తిని 30–35 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు తీసుకెళ్లాలన్నది ఈ సంస్థల లక్ష్యం.  

కేజీ డి–5లో ఉత్పత్తి ఆలస్యం: ఓఎన్‌జీసీ 
కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌ పరిధిలోని డి–5 బ్లాక్‌లో ఉత్పత్తి 2019 జూన్‌ నాటికి ప్రారంభించడం సాధ్యం కాదని ఓఎన్‌జీసీ స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వ విధానాల్లో మార్పులే కారణమని పేర్కొంది. జీఎస్టీ రావడం, స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధన, ప్రభుత్వరంగ సంస్థలు దేశీయంగానే ఐరన్, స్టీల్‌ను సమీకరించుకోవాలన్న నిబంధనలను అవరోధాలుగా పేర్కొంది. ముఖ్యంగా స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధనల వల్ల ఉత్పత్తి ఆలస్యం కావచ్చంటూ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది.

కేజీ డి–5 బ్లాక్‌లో నిక్షేపాలను వెలికితీసేందుకు గాను 5.07 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికకు ఓఎన్‌జీసీ బోర్డు 2016 మార్చిలో ఆమోదం తెలిపింది. అయితే, గతేడాది మే నెలలో కేంద్ర కేబినెట్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు మౌలిక ప్రాజెక్టుల కోసం దేశీయంగానే ఐరన్, స్టీల్‌ను సమకూర్చుకోవాలన్నది ఆ నిర్ణయం.  కేజీ డి–5 పరిధిలో ఉత్పత్తి జాప్యం కావడం వాస్తవానికి ఇది రెండోసారి. 2014 నాటి ఓఎన్‌జీసీ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది చమురు, వచ్చే ఏడాది గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభం కావాలి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top