మరోసారి ప్రపంచ కుబేరుడిగా బిల్‌గేట్స్‌!

Report Says Jeff Bezos May Loses World Richest Man Title To Bill Gates - Sakshi

వాషింగ్టన్‌ : అమెజాన్‌ షేర్లు పతనమైన నేపథ్యంలో కంపెనీ సీఈవో జెఫ్‌ బెజోస్‌ భారీగా సంపద కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న బెజోస్‌ స్థానాన్ని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సొంతం చేసుకున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్‌ భారీ నష్టాలు చవిచూడటం.. అదే విధంగా గురువారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏడు శాతం మేర పడిపోవడంతో... 2017 తర్వాత తొలిసారిగా కంపెనీ నికర ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఏడు బిలియన్‌ డాలర్ల మేర(స్టాక్‌ వాల్యూ) సంపద బెజోస్‌ చేజారింది. ఇక తాజా నివేదికల ప్రకారం బెజోస్‌ ఆస్తి 103.9 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం 105.7 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. దీంతో ఆయన మరోసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచారని పలు నివేదికలు పేర్కొన్నాయి.

కాగా 1987లో ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో తొలిసారిగా స్థానం దక్కించుకున్న బిల్‌ గేట్స్‌ 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇక 1998లో అమెరికా సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచిన బెజోస్‌.. అమెజాన్‌ షేర్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో 2018లో తొలిసారిగా బిల్‌ గేట్స్‌ను వెనక్కినెట్టి 169 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌ షేర్ల పతనం, భార్య మెకాంజీకి భరణం రూపంలో దాదాపు 36 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లు బదలాయించడంతో బెజోస్‌ రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది.(చదవండి : విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top