
ముంబై : ఒడిదుడుకులుగా సాగిన నేటి మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకొనిపోయాయి. తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.900 లెవల్ మార్కును దాటాయి. కంపెనీ ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో బలమైన రీఫైనింగ్ మార్జిన్లు, జియో రాబడులు ప్రకటించడంతో కంపెనీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. దీంతో రిలయన్స్ ఇంట్రాడేలో 3.7 శాతం పైకి జంప్ చేసింది. ఈ స్టాక్‌పై మెజార్టి పెట్టుబడిదారులు సానుకూలంగా వ్యవవరించడంతో పాటు, డిసెంబర్ నుంచి వారి టెలికాం వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయని కంపెనీ ప్రకటించడం షేర్లపై మంచి ప్రభావాన్ని చూపింది.
విశ్లేషకులు కూడా రిలయన్స్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాలపై సానుకూలంగా ఉన్నారు. 2017లో ఇప్పటివరకు కంపెనీ స్టాక్ 68 శాతం ర్యాలీ జరిపింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. నేటి ఇంట్రాడేలో కంపెనీ స్టాక్ రూ.915.55 వద్ద రికార్డు గరిష్టాలను తాకింది. నాలుగు రోజుల క్రితం ప్రకటించిన క్యూ2 ఫలితాల్లో కంపెనీ రూ.8,109 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని, రూ.101,169 కోట్ల రెవెన్యూలను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.5 శాతం పైకి ఎగిసింది.