ఆరు రంగాల్లో సంస్కరణలు.. | Reforms in India not fast enough, says IMF | Sakshi
Sakshi News home page

ఆరు రంగాల్లో సంస్కరణలు..

Jul 25 2016 1:32 AM | Updated on Sep 4 2017 6:04 AM

ఆరు రంగాల్లో సంస్కరణలు..

ఆరు రంగాల్లో సంస్కరణలు..

భారత్ ఆరు రంగాల్లో సంస్కరణలను చేపట్టాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఉద్ఘాటించింది.

భారత్‌కు ఐఎంఎఫ్ సూచన
* సానుకూలతలు, ప్రతికూలతలపై విశ్లేషణ
* సంస్కరణల వేగం తగ్గుతోందనీ అభిప్రాయం
* 2016, 2017ల్లో వృద్ధి అంచనా 7.4 శాతం
బీజింగ్:
భారత్ ఆరు రంగాల్లో సంస్కరణలను చేపట్టాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఉద్ఘాటించింది. ‘నోట్ ఆన్ గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ అండ్స్ పాలసీ చేంజెస్’ అన్న పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచంలోని పలు దేశాలతో పాటు  భారత్ వృద్ధి బాటలో నెలకొన్న సానుకూలతలు, ప్రతికూలతలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది.

చైనాలోని చెంగ్దూలో నిర్వహించిన జీ- 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండు రోజుల సమావేశం ముగింపును పురస్కరించుకుని ఈ నోట్‌ను రూపొందించింది. భారత్‌కు సంబంధించి  తదుపరి సంస్కరణలు చేపట్టాల్సిన రంగాల్లో ప్రొడక్ట్ మార్కెట్, కార్మిక, మౌలిక, బ్యాంకింగ్, న్యాయ వ్యవస్థ-ఆస్తి హక్కులు, ద్రవ్య వ్యవస్థాగత సంస్కరణ విభాగాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.  సంస్కరణల వేగం తగ్గడం, బలహీనంగా ఉన్న కార్పొరేట్ రంగం, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ అలాగే ఎగుమతుల క్షీణత ఆందోళనకరమైన అంశాలుగా విశ్లేషించింది.

2016, 2017ల్లో భారత్ వృద్ధి రేటును 7.4 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఉద్ఘాటించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన నేపథ్యంలో... అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారిందనీ విశ్లేషించింది. ఈ సవాలును ఎదుర్కొనడంపై అన్ని దేశాలూ దృష్టి సారించాలని సూచించింది.  నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే...
     
* ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉంది. చమురు ధరలు తక్కువగా ఉండడం, సానుకూల విధాన నిర్ణయాలు, వ్యాపార, పెట్టుబడుల విశ్వాసాలు మెరుగుపడ్డం దీనికి ప్రధాన కారణాలు.
* మొత్తం 9 రంగాలను ప్రాతిపదికగా తీసుకుని వివిధ దేశాలకు తీసుకోవలసిన చర్యలను నివేదిక సూచించింది.
* సంస్కరణలు చేపట్టాల్సిన రంగాలకు సంబంధించి వర్థమాన దేశాలైన చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకన్నా భారత్‌లో జాబితా ‘ఆరు’తో పెద్దదిగా ఉండడం గమనార్హం.
* తొమ్మిదింటిలో భారత్‌కు సంబంధించి మెరుగ్గా ఉన్న రంగాల్లో నూతన చొరవలు, క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్, ట్రేడ్-ఎఫ్‌డీఐ విధానాల సరళీకరణలు ఉన్నాయి.
* చైనా, దక్షిణాఫ్రికాల విషయంలో సంస్కరణలు చేపట్టాల్సిన ఐదు రంగాలను విశ్లేషించింది. బ్రెజిల్‌కు మూడు రంగాలను సూచించింది. రష్యా విషయంలో ఈ సంఖ్య ఏడుగా ఉంది.
 
7.5 వృద్ధి సరే... పేదల బాగేది: డ్రీజ్
భారత్ గడచిన 12 సంవత్సరాలుగా 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నా... సామాన్యుని జీవన ప్రమాణాల మెరుగుదలలో వైఫల్యం చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ విశ్లేషించారు. భారత్‌పాటు మరికొన్ని దేశాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొందని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేసిన డ్రీజ్ అన్నారు. ప్రస్తుతం డ్రీజ్ రాంచీ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గడచిన రెండేళ్లలో వృద్ధి ధోరణి ఆందోళన కలిగిస్తోందన్నారు.
 
బ్రెగ్జిట్‌తో సమస్యలు: జీ20 ఆర్థిక మంత్రులు
బ్రెగ్జిట్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సమస్యలు పొంచి ఉన్నట్టు జీ20 దేశాల ఆర్థిక మంత్రులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక అనిశ్చితి ఏర్పడిందన్న ఆందోళనల నేపథ్యంలో చెంగ్దూలో  జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం దీనిపై చర్చించింది. బ్రెగ్జిట్ వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోగల స్థితిలో ఈయూ సభ్య దేశాలు ఉన్నాయని... అలాగే, భవిష్యత్తులో ఈయూకు బ్రిటన్ సన్నిహిత భాగస్వామిగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ప్రాంతీయ రాజకీయ విభేదాలు, ఉగ్రవాదం, శరణార్ధుల వలసలు కూడా ప్రపంచ ఆర్థిక వాతావరణానికి సంక్లిష్టంగా మారాయని ఈ సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో పాల్గొన్న సందర్భంగా బ్రిటన్ ఆర్థిక మంత్రి ఫిలిప్‌హామండ్ మాట్లాడుతూ... ఈయూతో చర్చించడం ద్వారా అనిశ్చితికి ముగింపు పలుకుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement