ఆర్‌బీఐ హెచ్చరికలు పట్టని బ్యాంకులు

RBI warnings to banks - Sakshi

ముందుగా చెప్పినా మొద్దు నిద్ర 

దాంతో మోసాలకు అవకాశం

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ స్కామ్‌ బయటకు వచ్చే వరకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏం చేసింది...? మొద్దు నిద్ర పోయిందా...? అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  నిజానికి బ్యాంకుల పర్యవేక్షణను చూసే ఆర్‌బీఐ ఈ తరహా మోసాలపై గత రెండు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నా బ్యాంకు యాజమాన్యాలకు ఏ మాత్రం పట్టడం లేదు.

రూ. 11,400 కోట్ల నీరవ్‌మోదీ స్కామ్‌లో పీఎన్‌బీ ఉద్యోగులు బ్యాంకుల మధ్య అంతర్గత సమాచార వారధి అయిన స్విఫ్ట్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. స్విఫ్ట్‌ దుర్వినియోగం పెరుగుతున్న ఘటనలను ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా 2016 సెప్టెంబర్‌లోనే ఓ ప్రసంగంలో భాగంగా పేర్కొన్నారు. స్విఫ్ట్‌కు పూర్తి రూపం సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌.

గతేడాది నివేదికలో ప్రస్తావన
మోసాల సంఖ్య, వాటి విలువ పెరుగుతుండటాన్ని 2017 జూన్‌ నాటి ఆర్‌బీఐ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక రంగంలో మోసాల కారణంగా నష్టాలు 2017 నాటికి ఐదేళ్ల కాలంలో 72 శాతం పెరిగి రూ.16,770 కోట్లకు చేరాయని తెలిపింది. ‘‘స్విఫ్ట్‌ వ్యవస్థలో మోసపూరిత సందేశాలు వెళుతుండటం అంతర్గత నియంత్రణల వైఫల్యంతోపాటు ‘నాలుగు కళ్ల సూత్రం’ను (కనీసం ఇద్దరి ఆమోదం) పాటించకపోవడం వల్లే.

వేర్వేరు వ్యవస్థలపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం. కోర్‌బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంబంధిత లావాదేవీని నమోదు చేయకుండానే స్విఫ్ట్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు’’ అని ముంద్రా పేర్కొన్నారు. మరోవైపు ఆర్‌బీఐ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన పీఎన్‌బీ కేసులో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎస్‌ఎఫ్‌ఐవో విచారణకు ఆదేశించగా, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సైతం బ్యాంకు ఉద్యోగులకు సమన్లు జారీ చేసింది.

నిఘా లోపాలపై వారిని విచారించనున్నట్టు సమాచారం. కాగా, అన్ని ప్రభుత్వరంగ బ్యాం కులకు సీవీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. గత డిసెంబర్‌ 31 నాటికి మూడేళ్లు ఒకే చోట పనిచేస్తున్న అధికారులను, ఐదేళ్లుగా పనిచేస్తున్న క్లరికల్‌ ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో ఈడీ, సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

విదేశీ రుణ సమీకరణ ఇక కష్టమే..!
ఆర్‌బీఐ అనుమతులు కఠినతరం!
విదేశీ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు అనుమతించే విధానాన్ని ఆర్‌బీఐ మరింత కఠినం చేయనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను ఆర్‌బీఐ సమీక్షిస్తోంది. ఒకవేళ రూపాయి మారకం విలువలో అస్థిరతలు పెరిగితే రుణం తీసుకున్న వారి తిరిగి చెల్లింపులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల మార్కెట్లు పడిపోతే సమస్యలు రాకుండా కంపెనీల హెడ్జింగ్‌ విధానాలను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు వెల్లడించాయి.

  ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌ కింద విదేశాల నుంచి నిధుల సమీకరణకు కంపెనీలు ముందుగా రుణ నమోదు నంబర్‌ (ఎల్‌ఆర్‌ఎన్‌)ను పొందాల్సి ఉంటుంది. అయితే, కొందరికి ఆర్‌బీఐ ఎల్‌ఆర్‌ఎన్‌ జారీ చేయడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో భారత కంపెనీలు ఎగవేతదారులుగా మారకుండా నిరోధించడమే ఆర్‌బీఐ ప్రధాన ఉద్దేశమని విశ్లేషణ. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి పనితీరు ఆశాజనకంగా లేకపోగా, ఈ నెలలో విదేశీ బాండ్ల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

గతేడాది 15.6 బిలియన్‌ డాలర్ల మేర మన కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి నిధుల్ని సమీకరించాయి. ఒకవేళ ఆర్‌బీఐ రుణ సమీకరణ నిబంధనలను కఠినతరం చేస్తే భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ విదేశ్, ఆర్‌ఐఎల్‌ తదితర కంపెనీలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

స్విఫ్ట్‌ ఇన్‌ఫ్రాపై మూడుసార్లు హెచ్చరించాం: ఆర్‌బీఐ
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ  స్కామ్‌పై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతుండగా, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. బ్యాంకుల్లో మోసాలు పెరిగిపోవడానికి అవకాశం కల్పిస్తున్న పరిస్థితులను అధ్యయనం చేసి, వీటి నివారణకు సూచనలు చేసేందుకు వైహెచ్‌ మాలేగమ్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది. అలాగే, ఆస్తుల వర్గీకరణ, వాటికి నిధుల కేటాయింపుల పరంగా బ్యాంకుల మధ్య అంతరాలకు గల కారణాలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది.

మరోవైపు స్విఫ్ట్‌ ఇన్‌ఫ్రా దుర్వినియోగంతో వచ్చే సమస్యలపై 2016 ఆగస్ట్‌ నుంచి బ్యాంకులను మూడుసార్లు హెచ్చరించినట్టుఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులు తమ వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న స్విఫ్ట్‌ ఇన్‌ఫ్రాను హానికారక ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, వీటికి నివారణగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top