
హైజీనిక్ రీసెర్చ్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పెట్టుబడులు
సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హెచ్‌ఆర్‌ఐ)లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
ముంబై: సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హెచ్‌ఆర్‌ఐ)లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఎంత మేర వాటాలు కొనుగోలు చేసినదీ వెల్లడి కాలేదు. ఐటీ దిగ్గజం విప్రో గ్రూప్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ విభాగమే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్. సూపర్ వాస్మోల్, స్ట్రీక్స్ వంటి ఉత్పత్తులను విక్రయించే హైజీనిక్ వార్షిక టర్నోవరు సుమారు రూ. 350 కోట్లుగా ఉంది. రూ. 1,000 కోట్ల కంపెనీగా ఎదిగే దిశగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పెట్టుబడులు తమకు ఊతమివ్వగలవని హైజీనిక్ సీఈవో మనీష్ ఛాబ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీల ఆటోమేషన్‌కి, ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా వెచ్చించేందుకు ఈ నిధులు ఉపయోగపడగలవని తెలిపారు. అటు సంతూర్, చంద్రిక వంటి బ్రాండ్లతో ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ విప్రో గ్రూప్ కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో తాజాగా హెచ్‌ఆర్‌ఐలో వాటాల కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకుంది.