ఆ స్కామ్‌లో క్లర్క్‌ నుంచీ మేనేజర్‌ వరకూ..

PNBs internal Probe Blames Violations For Nirav Modis Fraud - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెనుప్రకంపనలు రేపిన పీఎన్‌బీ స్కామ్‌లో బ్యాంక్‌ అంతర్గత విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీకి నకిలీ పత్రాలపై భారీగా రుణాలు అందచేసే ప్రక్రియలో సాధారణ క్లర్క్‌ నుంచి విదేశీ మారకద్రవ్య మేనేజర్లు, ఆడిటర్లు, రీజినల్‌ కార్యాలయ అధిపతుల వరకూ పలువురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ స్కామ్‌కు కొద్దిమంది బ్యాంకు అధికారులే కుట్రపన్నినా నష్ట నివారణ, పర్యవేక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో అక్రమ లావాదేవీలను అడ్డుకోలేకపోయినట్టు బ్యాంకు అంతర్గత విచారణలో వెల్లడైంది.

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన జ్యూవెలరీ సంస్థలకు ముంబయిలోని పీఎన్‌బీ బ్రాంచ్‌ నకిలీ బ్యాంకు హామీ పత్రాలతో రుణాలు పొందేలా సహకరించిందని తొలుత భావించినా బ్యాంకుకు చెందిన అన్ని స్థాయిల్లో అన్ని విభాగాల్లో ఈ స్కామ్‌ మూలాలున్నాయని అంతర్గత విచారణలో తేలింది. బ్యాంక్‌కు సంబంధించిన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి ఏప్రిల్‌ 5న అంతర్గత విచారణ నివేదికను పీఎన్‌బీ అధికారులు సమర్పించారు.

ఈ కేసులో సహకరించేందుకు పోలీసులకు సైతం అంతర్గత విచారణలో రాబట్టిన వివరాలు, ఈ మెయిల్‌ సమాచారం సహా ఆధారాలను అందచేశారు.మరోవైపు తాజా పరిణామాలపై స్పందించేందుకు పీఎన్‌బీ ప్రతినిధి నిరాకరించారు. న్యాయస్ధానం పరిధిలో ఉన్న అంశాలను వెల్లడించలేమని, అయితే అక్రమాలకు పాల్పడినా ఏ స్థాయి ఉద్యోగిపైనైనా బ్యాంకు కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top