ఎస్‌ఎఫ్‌ఐవో విచారణకు హాజరైన పీఎన్‌బీ చీఫ్‌

PNB Chief who attended the SFIO investigation - Sakshi

ఐదు గంటల పాటు సాగిన విచారణ

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎండీ, సీఈవో సునీల్‌ మెహతా బుధవారం సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) ఎదుట విచారణకు హాజరయ్యారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పీఎన్‌బీ అధికారులతో చేతులు కలిపి రూ.12,626 కోట్ల భారీ మోసానికి పాల్పడిన కేసులో బ్యాంకు చీఫ్‌ను ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఆయన చెప్పిన వివరాలను నమోదు చేశారు. ముంబైలోని ఎస్‌ఎఫ్‌ఐవో కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్న మెహతా సాయంత్రం 4 గంటల వరకు విచారణలో పాల్గొని తిరిగి వెళ్లారు. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు అధికారులు సైతం మంగళవారం విచారణకు హాజరుకావటం తెలిసిందే.

అంతేకాదు ఈ రెండు బ్యాంకుల చీఫ్‌లతో పాటు మొత్తం 31 బ్యాంకుల అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. పీఎన్‌బీ చీఫ్‌ మెహతాతోపాటు బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేవీ బ్రహ్మాజీరావును విచారణకు హాజరు కావాలని ఎస్‌ఎఫ్‌ఐవో గత నెలలోనే కోరింది. ఈ కేసులో వారిని నిందితులుగా పరిగణించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన విచారణలో ఈ స్కామ్‌ను ఎలా గుర్తించారు? విధానపరమైన ప్రక్రియలేంటి? అనే అంశాలతో పాటు విధానపరమైన ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంపై అధికారులు దృష్టి సారించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top