ప్యాసింజర్‌ వాహన  అమ్మకాలు 1.11% డౌన్‌ 

Passenger vehicle sales down 1.11% - Sakshi

గడిచిన ఎనిమిది నెలల్లో 7వ సారీ తగ్గుదల

న్యూఢిల్లీ: గతనెల్లో దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 1.11 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 2,72,284 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 2,75,346 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గడిచిన ఎనిమిది నెలల్లో పీవీ అమ్మకాలు తగ్గుదలను నమోదుచేయడం ఇది 7వ సారి కావడం గమనార్హం. గతనెల్లో విక్రయాలు తగ్గడానికి.. ఎన్నికలకు ముందు అనిశ్చితి, మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండడం, అధిక వడ్డీ రేట్లు, బీమా వంటి ప్రతికూలతలు కారణమని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే పీవీ అమ్మకాలు 3.27 శాతం పెరిగాయి. 30,85,640 యూనిట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో 29,87,859 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రస్తుత పూర్తి ఏడాదికి 3 శాతం వృద్ధి అంచనాను సియామ్‌ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 8–10 శాతం అంచనాను ఇచ్చింది. మరోవైపు ద్విచక్ర వాహన అమ్మకాలు గతనెల్లో 4.22 శాతం తగ్గాయి. 16,15,071 యూనిట్లుగా ఉన్నాయి.  

మారుతీ ఆధిపత్యం.. 
పీవీ వాహన విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 0.19 శాతం వృద్ధితో ఫిబ్రవరిలో 1,39,912 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా 3.13 శాతం క్షీణతతో 43,110 యూనిట్లను విక్రయించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top