పోటీ పరీక్షలకు... ఇంట్లోనే పాఠాలు

Online training for central and state government competitive exams - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ

నియోస్టెన్సిల్‌లో 300 కోర్సులు; 60 మంది ప్రొఫెసర్లు

హైదరాబాద్, జైపూర్‌లో ప్రాంతీయ కేంద్రాలు కూడా..

‘స్టార్టప్‌ డైరీ’తో నియోస్టెన్సిల్‌ కో–ఫౌండర్‌ కుష్‌ బీజల్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐఏఎస్, ఐఈఎస్‌ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలంటే... కఠోరమైన సాధన, శిక్షణ, విశ్లేషణా నైపుణ్యం... ఇలా చాలా అస్త్రాలతో సన్నద్ధమవ్వాలి. ఇందుకోసం మెట్రో నగరాల్లోని టాప్‌ కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టాలి. అలా అని అందరూ తమ పిల్లల్ని శిక్షణ కేంద్రాలకు పంపించలేరు. ఆర్థిక సమస్యలు ఒక కారణమైతే.. దూరం, భద్రత వంటివి మరో కారణం! అలాకాక తమ పిల్లాడు ఇంట్లోనే దేశంలోని ఐఐటీ, ఐఐఎం వంటి టాప్‌ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పాఠాలు ప్రత్యక్షంగా వినే వీలుంటే? ఎంచక్కా ఇంట్లో నుంచే పోటీ పరీక్షలకు సిద్ధంకావచ్చు కదా!! ఇదే ఆలోచన ఇద్దరు అన్నదమ్ముల్ని స్టార్టప్‌ వైపు నడిపించింది. అదే నియోస్టెన్సిల్‌. పూర్తి వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ కుశ్‌ బీజల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.‘‘మాది రాజస్తాన్‌లోని మారుమూల గ్రామం. మా పేరెంట్స్‌ ఆర్థికంగా కాస్త ఉన్నవారు కావటంతో కోల్‌కతాలోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇప్పించారు. నాకు ఐఐటీ అహ్మదాబాద్‌లో, మా తమ్ముడు లవ్‌ బీజల్‌కు ఐఐఎం ఢిల్లీలో సీటొచ్చింది. మా పేరెంట్స్‌లా అంతా తమ పిల్లల్ని మెట్రో నగరాల్లోని ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌కు పంపించలేరని.. ఫీజులు భరించలేరని మేం అర్థం చేసుకున్నాక... దీనికి పరిష్కారం వెదికే క్రమంలో 2014లో రూ.15 లక్షల పెట్టుబడితో గుర్గావ్‌ కేంద్రంగా నియోస్టెన్సిల్‌ను ఆరంభించాం.

300 కోర్సులు; 60 మంది టీచర్లు..
సివిల్స్, ఐఈఎస్, ఎస్‌ఎస్‌ఎసీ, బ్యాంకింగ్, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ నియోస్టెన్సిల్‌లో ఉంది. ప్రస్తుతం 300 కోర్సులున్నాయి. శిక్షణ కోసం సివిల్‌ సర్వీస్‌ శిక్షణ సంస్థలు, రిటైర్డ్‌ ఐఐటీ, ఐఐఎంలు, టాప్‌ కాలేజీల ప్రొఫెస ర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా ఫ్లాట్‌ఫాంలో 60 మంది టీచర్లున్నారు. ఒకే సబ్జెక్ట్‌లో నలుగురైదుగురు టీచర్లుంటారు. అభ్యర్థి తనకు నచ్చిన ప్రొఫెసర్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన సమయం, తేదీ ప్రకారం ప్రత్యక్ష పాఠాలుంటాయి. ఆ సమయానికి అభ్యర్థి లైవ్‌లో పాఠం వినలేకుంటే దాన్ని రికార్డ్‌ చేసుకోవచ్చు. దీంతో వీలున్నప్పుడల్లా వినే వీలుంటుంది. ఆన్‌లైన్‌ ప్రత్యక్ష పాఠాలతో పాటు టెస్ట్‌ సిరీస్, కౌన్సెలింగ్, బృంద చర్చలు, స్టడీ మెటీరియల్‌ వంటివి కూడా అందిస్తాం.

నియోస్టెన్సిల్, టీచర్లకు 50:50..
కోర్సును బట్టి ధరలు రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉన్నాయి. అభ్యర్థులు చెల్లించే ఫీజులో 50 శాతం టీచర్లకు, మిగిలింది కంపెనీకి. ఇప్పటిదాకా నియోస్టెన్సిల్‌లో 3 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 6 వేల మంది పెయిడ్‌ యూజర్లు. ప్రస్తుతం ఏడాదికి 3 వేల మంది అభ్యర్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను 7 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగిసేలోగా టీచర్ల సంఖ్యను 150కి, కోర్సుల సంఖ్యను వెయ్యికి చేర్చాలని లకి‡్ష్యంచాం.

హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం..
ఆన్‌లైన్‌ పాఠాలతో పాటు ఆఫ్‌లైన్‌లో హైదరాబాద్, జైపూర్‌లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. వీటిల్లో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. స్థానికంగా ఉండే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో మా సేవలను వినియోగించుకోవచ్చు. త్వరలోనే దేశంలో మరో 20 ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఐఐటీ, ఐఐఎం ఎంట్రన్స్‌ కోర్సులను కూడా ప్రారంభిస్తాం. రెండేళ్లలో విదేశీ కోర్సులు, ఉద్యోగాలపై కూడా లైవ్‌ పాఠాలు ప్రారంభిస్తాం.

33 కోట్ల నిధుల సమీకరణ..
మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. డిసెంబర్‌కి ఈ సంఖ్యను 80కి చేరుస్తాం. ఇటీవలే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎం అండ్‌ ఎస్‌ పార్టనర్స్, ప్యారగాన్‌ ట్రస్ట్, జబాంగ్, యూనికామర్స్‌ ఫౌండర్ల నుంచి రూ.6 కోట్లు సమీకరించాం. అనలిటకల్‌ ఆధారిత టెస్ట్‌ ప్రాక్టీస్‌ పోర్టల్‌ టెస్ట్‌కేఫ్‌నూ కొనుగోలు చేశాం. ఈ ఏడాది ముగిసేనాటికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మరో ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేయనున్నాం. అలాగే రూ.33 కోట్ల నిధుల సమీకరిస్తాం’’ అని కుశ్‌ వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top