
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్ గణాంకాలు వ్యవస్థలో మందగమన స్థితికి అద్దం పట్టాయి. ధరల స్పీడ్ కేవలం 0.58 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 నవంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో అదే బాస్కెట్ ధర కేవలం 0.58 శాతమే పెరిగిందన్నమాట. అయితే సామాన్యునికి సంబంధించి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు వార్షికంగా చూస్తే, ఏకంగా 172 శాతం పెరిగాయి. ఈ ధరలూ పెరగకపోతే, టోకు ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారిపోయేదని అంచనా. 2019 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 0.16 శాతం అయితే 2018 నవంబర్‌లో ఈ రేటు 4.47 శాతం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల అసలు నమోదుకాలేదు. 2018 నవంబర్‌తో పోల్చితే 2019 నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర –0.84 శాతం క్షీణించింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 4.21 శాతం.
ఇంధనం, విద్యుత్: సూచీలో దాదాపు 22 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం –7.32 శాతం క్షీణించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 15.54 శాతం.
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం భారీగా 7.68 శాతం పెరిగింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 0.59 శాతం మాత్రమే. ఇక ఇందులోనూ నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూసుకుంటే ద్రవ్యోల్బణం 6.40 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గింది.
సామాన్యుడిపై భారం...
ఫుడ్ ఆర్టికల్స్ చూస్తే... 2018 నవంబర్‌లో అసలు ఈ విభాగంలో పెరుగుదల నమోదుకాకపోగా, –3.24 శాతం క్షీణతలో ఉంది. అయితే తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర ఏకంగా 11.08 శాతం ఎగసింది. గడచిన 71 నెలల్లో ఈ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్‌లో ఈ రేటు 9.80 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు 172 శాతం పెరిగితే, కూరగాయల విషయంలో ఈ ధర స్పీడ్ 45.32 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు టోకున 16.59 శాతం ఎగశాయి.