45 ఏళ్ల గరిష్ట స్ధాయిలో నిరుద్యోగ రేటు

Nsso Report Says Unemployment Rate Highest In Fortyfive Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే కలకలం రేపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో నాలుగున్నర దశాబ్ధాల గరిష్టస్ధాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. 2017-18లో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేని విధంగా 6.1 శాతానికి ఎగబాకిందని నివేదిక వెల్లడించింది. అధికారికంగా విడుదల కాని ఈ సర్వే నివేదిక తమకు అందుబాటులో ఉందని బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదిక అంశాలను ప్రస్తావిస్తూ తెలిపింది.

మధ్యంతర బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు వెలుగులోకి వచ్చిన ఈ నివేదిక ఆధారంగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడికి పదునుపెట్టాయి. మరోవైపు నివేదిక వెల్లడించడంలో జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ గణాంక కమిషన్‌ తాత్కాలిక చైర్మన్‌ పీసీ మోహనన్‌ సమా ఇద్దరు సభ్యులు కమిషన్‌ నుంచి తప్పుకున్నారు. కాగా, నిరుద్యోగిత రేటు పెరగడంపై నోట్ల రద్దు ప్రభావం ఉన్నట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అత్యధికంగా 7.8 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా నమోదైంది. ఆర్ధిక కార్యకలాపాల్లో గత సంవత్సరాల కంటే కార్మిక ఉద్యోగుల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఉద్యోగుల సమూహం నుంచి బయటకువస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top