డ్యూటీలో ఉన్నప్పుడు వాట్సాప్‌ వాడారో అంతే..

No WhatsApp during work hours for Railways staff

సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రత నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మెసేజింగ్‌ యాప్‌లో ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకున్న యాప్‌ వాట్సాప్‌ను, డ్యూటీలో ఉన్న సమయంలో వాడకూడదంటూ ఆపరేషనల్‌ స్టాఫ్‌ను రైల్వే ఆదేశించింది. ఈ మెసేజింగ్‌ యాప్‌ పనిప్రదేశంలో ఎక్కువ ఆటంకం కలిగిస్తుందని గుర్తించిన రైల్వే అధికారులు, తమ స్టాఫ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పని సయమాల్లో ఈ యాప్‌ను వాడకూడదంటూ సూచనలు పంపించారు. ఢిల్లీ డివిజన్‌కు చెందిన మొత్తం స్టాఫ్‌కు ఈ సర్క్యూలర్‌ జారీఅయింది. వీరిలో డ్రైవర్లు, గార్డులు, టీటీఈలు, ఇతర స్టేషన్‌ మేనేజర్లున్నారు. ఎవరైనా తమ సూచనలను అతిక్రమిస్తే, వారిపై కఠిన చర్యలుంటాయని రైల్వే అధికారులు హెచ్చరించారు. 

రైల్వే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని డివిజన్లకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు సీనియర్‌ రైల్వే అధికారి పేర్కొన్నారు. సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌, ఆపరేషనల్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన కొందరు ఉద్యోగులు పనిప్రదేశాల్లో వాట్సాప్‌, యూట్యూబ్‌ ఎక్కువగా వాడుతున్నారని గుర్తించామని చెప్పారు. ప్రయాణికుల భద్రతను పన్నంగా పెట్టి వీటిని ఎక్కువగా వాడటం అతిపెద్ద సమస్యలకు దారితీస్తుందన్నారు. ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో రైల్వే అధికారులు ఈ కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రమాదాలను నిర్మూలించడానికి, రైలు ప్రయాణాన్ని సురక్షితవంతం చేయడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వాని లోహని కూడా చెప్పారు. స్టేషన్‌ మేనేజర్లు, సూపరిటెండెంట్లు డ్యూటీలో ఉన్నప్పుడు స్టేషన్‌లో వాట్సాప్‌ వాడటానికి వీలులేదంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. వరుస రైలు ప్రమాదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా రైల్వే సంబంధిత సమస్యలన్నింటిన్నీ పరిష్కరించాలని అధికారులకు డెడ్‌లైన్‌ విధించారు.

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top