తీపిగుర్తులు మిగిల్చిన ‘కేఫ్‌ కాఫీ డే’

Netizens Shares Emotional CCD Memories Over VG Siddhartha Demise - Sakshi

సౌమ్యుడు, నిరాడంబరుడిగా పేరొందిన కాఫీ మొఘల్‌ వీజీ సిద్ధార్థ జీవితం అర్ధాంతరంగా ముగియడం పట్ల బిజినెస్‌ వర్గాలే కాకుండా సామాన్యులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అదృశ్యమైన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం నేటి ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ మృతి పట్ల వ్యాపారవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ ‘కాఫీ డే’ తమకు మిగిల్చిన తీపి గుర్తులను తలచుకుంటూ పలువురు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

‘ఎన్నో పెళ్లిళ్లు, మరెన్నెన్నో ప్రేమకథలు, స్నేహితుల డేటింగ్‌లు, బిజినెస్‌ మీటింగులు, కెరీర్ ప్రణాళికల చర్చలు.. ఇలా ఎన్నెన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా నిలిచిన కాఫీ డేలు 90ల్లో పుట్టిన వారికి ఎన్నో మధురానుభూతులను మిగిల్చాయి. కొత్త తరానికి కూడా చెరగని ఙ్ఞాపకాలు అందిస్తున్నాయి. వాటికి కారణమైన సిద్ధార్థ కథ ఇలా విషాదాంతంగా ముగుస్తుందనుకోలేదు. ఆయన ఇక లేరంటే నమ్మలేకపోతున్నాం. దేశ వ్యాపార సామ్రాజ్యానికి నేడు ఒక దుర్దినం’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించిన సిద్ధార్థ... తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగిన సిద్థార్థ కథ విషాదాంతమవడం పలువురిని కలచివేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top