స్టార్టప్స్‌కి ఏం సందేశమిస్తున్నట్లూ.. | Mindtree to be run independently for now, says L&T | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌కి ఏం సందేశమిస్తున్నట్లూ..

Mar 20 2019 12:55 AM | Updated on Mar 20 2019 12:55 AM

Mindtree to be run independently for now, says L&T - Sakshi

బెంగళూరు: బలవంతపు టేకోవర్‌ యత్నాలు చేస్తున్న లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)పై ఐటీ సంస్థ మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు నిప్పులు చెరిగారు. దిగ్గజ సంస్థ అయి ఉండి .. సొంతంగా ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీని నిర్మించుకోలేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బలవంతపు టేకోవర్‌ ప్రయత్నాలతో విశ్వసనీయత.. నిజాయితీ గల స్టార్టప్స్‌కి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. ఎల్‌అండ్‌టీకి మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు అయిదు ప్రశ్నలు సంధించారు. టేకోవర్‌ని తమ ఉద్యోగులు కూడా ఇష్టపడటం లేదని, ఒకవేళ బలవంతంగా చేజిక్కించుకున్న పక్షంలో వారు నిష్క్రమిస్తే కంపెనీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని సూచించారు. ‘మీ కంపెనీ టర్నోవరు రూ. 1,20,000 కోట్లకు పైగా ఉంటుంది. మా కంపెనీతో పోలిస్తే ఏకంగా 18 రెట్లు పెద్దది. అలాంటప్పుడు పక్క కంపెనీని దెబ్బతీయకుండా మీ సొంత వనరులు, సామర్థ్యాలతో ఒక గొప్ప టెక్నాలజీ సంస్థను నిర్మించుకోలేరా? మైండ్‌ట్రీ ఉద్యోగులు కేవలం జీతం కోసమే పనిచేయరు. వారికంటూ ఒక లక్ష్యం ఉంది. దాన్ని లాగేసుకుంటే.. వారూ ఉండరు. అప్పుడు ఎవరూ లేని ఈ కంపెనీని ఏం చేసుకుంటారు‘ అని మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైండ్‌ట్రీ ప్రమోటరు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణకుమార్‌ నటరాజన్‌ ప్రశ్నించారు.
 

ఒకవేళ ఎల్‌అండ్‌టీ ఏకపక్షంగా ముందుకే వెడితే.. ఒక చెడ్డ ఉదాహరణగా నిల్చిపోతుందన్నారు. మైండ్‌ట్రీ ప్రత్యేక సంస్కృతికి ఆకర్షితులై వచ్చిన క్లయింట్లు.. బలవంతపు టేకోవర్‌ జరిగితే వేరే కంపెనీలవైపు మళ్లే ప్రమాదముందని చెప్పారు. ‘అదే జరిగితే ఇటు మా సంస్థ, అటు మీ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసినవారవుతారు. ఇలా చేయడం సబబేనా‘ అని ఆయన ప్రశ్నించారు. దాదాపు రూ. 10,800 కోట్లతో మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్‌ చేసేందుకు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కంపెనీలో మెజారిటీ ఇన్వెస్టర్‌ అయిన కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాల కొనుగోలుకు ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. బహిరంగ మార్కెట్‌ నుంచి మరో 15 శాతం, ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా ఇంకో 31 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అయితే, ఈ టేకోవర్‌ను మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ తమ చేతుల నుంచి జారిపోకుండా ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే షేర్ల బైబ్యాక్‌ కూడా చేపట్టనున్నారు. సోమవారం ముగింపుతో పోలిస్తే కేవలం 1.81 శాతం ప్రీమియం ఆఫర్‌ చేయడంపై అటు మైండ్‌ట్రీలో వాటాలున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే ఎల్‌అండ్‌టీని 1980లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బలవంతంగా టేకోవర్‌ చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. అప్పట్లో ఉద్యోగులే ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారు. 
టేకోవర్‌ వివాదం వార్తల నేపథ్యంలో        మంగళవారం ఎల్‌అండ్‌టీ, మైండ్‌ట్రీ షేర్లు క్షీణించాయి. బీఎస్‌ఈలో మైండ్‌ట్రీ షేరు ధర 2.03 శాతం తగ్గి రూ. 943 వద్ద క్లోజయ్యింది. అటు       ఎల్‌అండ్‌టీ షేరు 1.60 శాతం క్షీణించి రూ. 1,356.75 వద్ద ముగిసింది. అయితే, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ స్టాక్‌ మాత్రం 3.99 శాతం పెరిగి    రూ. 1,636.05 వద్ద క్లోజయ్యింది.  

ప్రమోటర్లనూ ఒప్పిస్తాం:  ఎల్‌అండ్‌టీ ఎండీ సుబ్రహ్మణ్యన్‌
బలవంతపు టేకోవర్‌ ప్రయత్నాలపై విమర్శలు ఎదుర్కొంటున్న ఎల్‌అండ్‌టీ ఈ వ్యవహారంపై స్పందించింది. మూడు నెలల క్రితం వీజీ సిద్ధార్థ తన వాటాల విక్రయం కోసం తమను సంప్రదించడం వల్లే ఈ డీల్‌కు బీజం పడిందని ఎల్‌అండ్‌టీ ఎండీ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. ఇతర వ్యాపారాలకి సంబంధించి నిధుల అవసరం ఉన్న సిద్ధార్థ... తాము కాకపోతే మరొకరికైనా సరే ఎలాగూ వాటాలను విక్రయించేసి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  ‘ప్రేమాభిమానాల’తో అందరి మనసూ చూరగొంటామని, ప్రమోటర్లను కూడా ఒప్పించగలమనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. మైండ్‌ట్రీలో కనీసం 26 శాతం వాటాలైన దక్కించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మైండ్‌ట్రీ రాబోయే రోజుల్లోనూ ప్రత్యేక సంస్థగానే కొనసాగుతుందని, దాన్ని విలీనం చేసుకునే యోచనేదీ లేదన్నారు. తమ ప్రధాన వ్యాపారమైన ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) విభాగంలో లాభాల మార్జిన్లు 5–6 శాతంగా ఉంటాయని, కానీ ఐటీ సర్వీసుల్లో సాధారణంగా 15–16 శాతం మేర ఉంటాయని.. అందుకే మైండ్‌ట్రీ కొనుగోలుపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలన్నింటి నుంచి 30–45 రోజుల్లోగా ఈ డీల్‌కు అనుమతులు రాగలవని భావిస్తున్నట్లు గ్రూప్‌ సీఎఫ్‌వో ఆర్‌ శంకరరామన్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement