భారత్‌ రావాలంటే నా డిమాండ్‌ నెరవేర్చండి

Mehul Choksi Makes This Demand For Returning To India - Sakshi

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.12,700 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారుల్లో నీరవ్‌ మోదీతో పాటు మెహుల్‌ చౌక్సి కూడా ఒకరు. గీతాంజలి జెమ్స్‌కి ఇతను ప్రమోటర్‌. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలు విదేశాలకు చెక్కేశారు. అనంతరం స్కాం వెలుగులోకి రావడం, భారత్‌లో వీరి సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు దాడులు జరపడం, నీరవ్‌, మెహుల్‌ పాస్‌పోర్టులు రద్దవడం వంటివన్నీ జరిగాయి. ప్రస్తుతం గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ అయిన మెహుల్‌ చౌక్సి భారత్‌కు రాదలుచుకున్నాడ. అయితే పాస్‌పోర్టు రద్దును వెనక్కి తీసుకుంటే, తాను భారత్‌కు వస్తానంటూ మెహుల్‌ చౌక్సి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ రద్దు ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేయమని కోరుతున్నాడు. 

ఇదే విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ కోర్టుకు తెలిపింది. అతనికి వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయమని, ఈడీ కౌన్సిల్‌ హిటెన్‌ వెంగోకర్‌ కోరారు. చౌక్సి డిమాండ్‌ను తోసిపుచ్చిన వెంగోకర్‌, పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినవసరం లేదని, భారత్‌కు తిరిగి రావడానికి తాత్కాలిక ప్రయాణ అనుమతి చాలని పేర్కొన్నారు. ఇదే ఆదేశాలను రేపు కోర్టు కూడా జారీచేయనుంది. అతని పేరుపై ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపినప్పటికీ, దర్యాప్తు సంస్థల ముందు అతను విచారణకు హాజరు కాలేదు. చౌక్సికి వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా దాఖలైంది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో మెహుల్‌ చౌక్సికి చెందిన 41 స్థిర ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. అతనికి వ్యతిరేకంగా బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. భారత్‌లో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి, విజయ్‌ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేంగా ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు పేరుతో దీన్ని పాస్‌ చేసింది. ఈ బిల్లు ద్వారా విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారుల బినామీ ఆస్తులపై చర్యలు తీసుకోనుంది.

 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top