
మ్యాక్స్‌క్యూర్‌లో వాటా విక్రయం
వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో యూరప్ సంస్థ మెడికవర్ 22 శాతం వాటా చేజిక్కించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించింది.
♦ మెడికవర్ చేతికి 22 శాతం వాటా
♦ విలువ రూ.100 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో యూరప్ సంస్థ మెడికవర్ 22 శాతం వాటా చేజిక్కించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించింది. రెండేళ్లలో మరో రూ.220 కోట్ల దాకా వ్యయం చేయనుంది. తద్వారా మెడికవర్ వాటా 51 శాతానికి చేరుతుందని మ్యాక్స్‌క్యూర్ ఎండీ అనిల్ కృష్ణ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు నగరాల్లో 9 ఆసుపత్రులను నిర్వహిస్తున్నామని, 1,500 పడకల సామర్థ్యం ఉందని ఆయన తెలియజేశారు.
2016–17లో రూ.350 కోట్ల టర్నోవర్ సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు ఆశిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 250 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదించామని, వరంగల్, కాకినాడలోనూ అడుగు పెట్టనున్నామని వివరించారు. బెంగళూరు, పుణే, చెన్నై, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తామని మ్యాక్స్‌క్యూర్ సీఈవో హరికృష్ణ చెప్పారు. రెండేళ్లలో ఆసుపత్రుల సంఖ్య 20కి చేరనుందని, ఇందుకు రూ.500 కోట్ల దాకా వెచ్చిస్తామని తెలియజేశారు.
భారత్‌లో సెలెక్స్ గ్రూప్ పాగా..
మెడికవర్‌ను ప్రమోట్ చేస్తున్న సెలెక్స్ గ్రూప్ భారత్‌లో దీర్ఘకాలిక వ్యూహంతో అడుగులేస్తోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో గతేడాది ఏడు ఫెర్టిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మరో 10 కేంద్రాలను నెలకొల్పుతామని, 2019 కల్లా వీటి సంఖ్య 50కి చేరుతుందని మెడికవర్ చైర్మన్ ఫ్రెడ్రిక్ స్టెన్మో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘మార్కెట్ కంటే వేగంగా మ్యాక్స్‌క్యూర్‌ను విస్తరిస్తాం. ప్యారడైజ్ రెస్టారెంట్స్‌లో మాకు 50 శాతం వాటా ఉంది.
ఈ రెస్టారెంట్ల సంఖ్య పెరిగేలా చూస్తాం. రానున్న రోజుల్లో భారత్‌లో డయాగ్నొస్టిక్ సేవల్లోకి కూడా ప్రవేశిస్తాం. ఏడేళ్లలో దేశంలో రూ.650 కోట్ల దాకా ఖర్చు చేశాం. మ్యాక్స్‌క్యూర్ పెట్టుబడి చాలా చిన్నది. ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తాం. మా కుటుంబంలో రెండో తరం వ్యాపార బాధ్యతలు తీసుకుంది. భారత్‌లో అపార వ్యాపార అవకాశాలున్నాయి. ఇక్కడ నిలదొక్కుకుంటాం’’ అని వెల్లడించారు. సెలెక్స్ గ్రూప్ నిర్వహణలో ఒరిఫ్లేమ్, ఒరెసా అసెట్ మేనేజ్‌మెంట్ వంటి కంపెనీలున్నాయి.