దివాలా అంచున ఎయిర్‌లైన్స్‌

Many Airlines At Brink Of Bankruptcy - Sakshi

తక్షణం ఆదుకోకపోతే  పలు సంస్థల మూసివేత

కేంద్ర మంత్రులకు ఫిక్కీ లేఖ

సహాయక చర్యలకు విజ్ఞప్తి 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్‌ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్‌ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురికి ఫిక్కీ ఏవియేషన్‌ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌ స్టాన్లీ లేఖ రాశారు. దేశీ ఎయిర్‌లైన్స్‌ ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీలు రుణదాతలు జప్తు చేసుకోకుండా 90 రోజుల వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు, ఇతర చార్జీల నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘గడిచిన కొద్ది రోజులుగా విమాన సేవలు నిల్చిపోవడంతో ఏవియేషన్‌ పరిశ్రమ దగ్గరున్న నిధుల నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఇదీ ఒకటి’ అన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top