మెరుపు తగ్గిన పసిడి

మెరుపు తగ్గిన పసిడి


ఇదీ... నిపుణులు చెబుతున్న మాట

♦ బంగారం పెరుగుతుంది అనడానికి సంకేతం ఒక్కటీ లేదు

♦ ఇంకా తగ్గే అవకాశం ఉండటంతో బంగారంలో ఇన్వెస్ట్ చేయొద్దు

♦ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉండాలనుకునే వారు 3-5 శాతం దాటకుండా చూసుకోండి

♦ ఇప్పటి వరకు లేనివారు 5-7 ఏళ్ల దృష్టితో ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా కొనండి

♦ వెయ్యి రూపాయలు తగ్గినప్పుడల్లా కొనాలనుకున్న దాంట్లో కొంత మొత్తం కొనండి

♦ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారు కూడా ఇలాగే కొనండి...

 

 బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేటు, షేర్లు మాత్రమే కాదు. నమ్మకమైన ఇన్వెస్ట్‌మెంట్లలో బంగారం ఒకటి. ఎందుకంటే అది ఆభరణాల రూపంలో అందానికి మెరుగులు దిద్దటమే కాదు. ఏటా ధర పెరుగుతూ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో లాభాన్నీ ఇస్తుంది. అవసరమైనపుడు తనఖా పెట్టినా, అమ్మినా వెంటనే నగదు చేతికొచ్చేస్తుంది. వీటన్నిటికీ తోడు... ఎన్నేళ్లయినా ఎంచక్కా దాచుకోవచ్చు. ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే భారతీయులకు పసిడిపై తగని మోజు. పిల్లలు... ప్రత్యేకించి ఆడపిల్లలు పుడితే... వారి జీవితంలో ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రులు తమకు వీలైనంత బంగారాన్ని కొని వెనకేస్తుంటారు.



మనవాళ్లు బంగారం ధరలు పడినపుడల్లా ఎగబడి కొంటుంటారు. అలాంటిది... ఇపుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగారం ధర గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరింది. గతంలో ఈ ధరకు వచ్చినపుడు ఎగబడి కొన్నవాళ్లు కూడా ఇపుడు వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గుతుందిలే... అపుడు కొందాం... అంటున్నారు. ఎందుకిలా? అసలు బంగారం ధర ఎందుకు పడుతోంది? మున్ముందు ఇంకా తగ్గుతుందా? లేక ఇదే సరైన ధరా? నిపుణులేమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం...

 

 18 వేలకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

  పసిడికి ప్రస్తుతం ప్రతికూల సంకేతాలే ఉన్నాయి. సాంకేతికంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కీలకమైన 1,140 డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోయి ఐదేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పతనం 800 డాలర్ల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచేలోగా పది గ్రాముల బంగారం ధర భారత్‌లో రూ. 22,000 - 23,000 వరకు రావచ్చు. అప్పుడు కొద్దిగా కొనుగోళ్ళ మద్దతు లభించినా వచ్చే 6 నెలల్లో రూ.20,000 - 18,000 దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు బంగారం కూడా తగ్గుతుంది.



అగ్రదేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చమురు ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాసహా పలు దేశాల్లో వడ్డీరేట్లు జీరో స్థాయి వద్ద ఉండటంతో పెట్టుబడి కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారు. ఒక్కసారి వడ్డీరేట్లు పెరిగితే బంగారంలోకి పెట్టుబడులు ఆగిపోతాయి. మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో డాలరు విలువ మరింత పెరిగే అవకాశాలు తక్కువ. దీంతో రూపాయి విలువ క్షీణించడం ద్వారా బంగారం పెరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తే స్వల్ప, మధ్య కాలానికి బంగారం మరింత క్షీణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 - ఆర్. నమశ్మివాయ, డెరైక్టర్, జెన్‌మనీ.

 

 టార్గెట్ రూ. 23,500

 అంతర్జాతీయంగా  సంక్షోభాలు సద్దుమణుగుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఉండే ఈక్విటీ వంటి పథకాల కేసి చూస్తున్నారు.  ఇండియాలో కూడా డిమాండ్ తగ్గటం విశేషం. 2014 మేలో 3.12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా ఈ ఏడాది మేలో 2.42 బిలియన్ డాలర్ల విలువైన పసిడి మాత్రమే దిగుమతి చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కీలకమైన 1,128 డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోవడంతో సాంకేతికంగా 990 డాలర్లకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇండియా మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 24,000-23,500కు రావచ్చు.

 - రవీంద్రరావు, కమోడిటీ రీసెర్చ్ హెడ్, ఆనంద్‌రాఠి కమోడిటీస్.

 

 610 డాలర్లకు పడిపోతుందా?

 కొన్నాళ్లుగా పరిమిత శ్రేణిలో కదిలిన బంగారం ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది. మున్ముందు ఈ పతనం మరింత వేగం పెంచుకునే అవకాశముంది. ప్రస్తుతం 1,100 డాలర్ల దిగువనున్న ఔన్స్ బంగారం ధర ఇంకా ఎంత తగ్గుతుందనేది అమెరికా ఫెడరల్ బ్యాంక్, డాలరు విలువపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డాలరు, బంగారం ధరలు వ్యతిరేక దిశలో పయనిస్తాయి. డాలరు పెరిగితే బంగారం తగ్గడం, డాలరు తగ్గితే బంగారం పెరగడం జరుగుతుంది.



గడిచిన ఏడాదిలో డాలరు విలువ రూ.60.50 నుంచి రూ. 64.131కు పెరిగింది. ఒక్కసారి డాలరు విలువ పెరిగితే సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉన్న బంగారానికున్న పేరు పోతుంది. అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు రూపంలో ఉండే పెట్టుబడి సాధనాలకు డిమాండ్ పెరుగుతుంది. మున్ముందు బంగారం 1,000 డాలర్లకు కిందకు రావడమే కాకుండా 2007 స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2007లో అమెరికా ఆర్థిక సంక్షోభం మొదలైనప్పుడు పసిడి 610 డాలర్లుండేది. ఆ స్థాయికి ఇప్పుడు వస్తుందా రాదా అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది.

 - జమ్మీల్ అహ్మద్, చీఫ్ మార్కెట్ ఎనలిస్ట్, ఫారెక్స్ టైమ్.

 

 అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గటంతో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా దీని గురించే మాట్లాడుకునే పరిస్థితి తలెత్తింది. ఔన్స్ బంగారం ధర ఐదున్నరేళ్ల కనిష్ట స్థాయి 1,100 డాలర్ల దిగువకు పడిపోయింది. 2011 సెప్టెంబర్‌లో 1,900 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టస్థాయి ఉండగా... ఇప్పటికి ఏకంగా 42 శాతం నష్టపోయింది. డాలర్ ధర కూడా పెరగటం వల్ల దేశీ మార్కెట్లో ఈ స్థాయిలో ధర తగ్గలేదు. అయితే గరిష్ఠ స్థాయి నుంచి 29 శాతం వరకూ తగ్గింది. గతంలో పది గ్రాముల బంగారం ధర రూ.34,000 రికార్డు స్థాయి ఉండగా ఇపుడు రూ.25,000 కిందకు వచ్చింది. ఇంతకంటే ఇంకా తగ్గుతుందా లేదా అన్నదానిపై నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నా... ఒక్క విషయంలో మాత్రం అంతా ఏకీభవిస్తున్నారు.



ధరలు మరింత తగ్గకపోయినా తక్షణం వేగంగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే బాగా క్షీణించడంతో ప్రస్తుత స్థాయి నుంచి కొద్దిగా పెరిగినా తిరిగి తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇపుడు బంగారాన్ని సూచించలేమని, అవసరాల కోసం కొనేవారు తగ్గుతున్నప్పుడు కొంచెం కొంచెంగా కొనటం మేలని వారు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top