ఐటీసీ మరో 24 హోటళ్లు

KTR launches ITC Kohenur - Sakshi

అయిదేళ్లలో అందుబాటులోకి

హైటెక్‌సిటీ వద్ద కోహినూర్‌ హోటల్‌

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న ఐటీసీ వచ్చే అయిదేళ్లలో కొత్తగా 24 హోటళ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు నాలుగు బ్రాండ్లలో 107 హోటళ్లున్నాయి. వీటి సామర్థ్యం 9,500 గదులు. కొత్త హోటళ్ల రాకతో గదుల సంఖ్య 12,000లకు చేరనుందని సంస్థ ఎండీ సంజీవ్‌ పురి సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు.

హైటెక్‌ సిటీ సమీపంలో కంపెనీ నెలకొల్పిన లగ్జరీ హోటల్‌ ఐటీసీ కోహినూర్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఐటీసీ చైర్మన్‌ వై.సి.దేవేశ్వర్‌ ప్రారంభించారు. రూ.775 కోట్లతో 271 గదులతో దీనిని నిర్మించారు. కొత్త హోటల్‌ సహా ఇప్పటి వరకు తెలంగాణలో ఐటీసీ రూ.2,500 కోట్లదాకా పెట్టుబడి పెట్టింది.

రూ.25,000 కోట్లతో..
వచ్చే అయిదేళ్లలో ఐటీసీ వివిధ రంగాల్లో రూ.25,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో రూ.10,000 కోట్లు ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు వ్యయం చేయనుంది. వినియోగ వస్తువుల తయారీ, సరుకు రవాణా కోసం 20 కేంద్రాలను దేశవ్యాప్తంగా నెలకొల్పుతామని సంజీవ్‌ పురి వెల్లడించారు.

కొన్ని నిర్మాణంలో ఉన్నాయని, తెలంగాణలో సైతం ఇటువంటి కేంద్రం రానుందన్నారు. భద్రాచలం పేపర్‌బోర్డ్‌ యూనిట్‌ సామర్థ్యాన్ని పెంచుతామని  వివరించారు. రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సేవల్లోకి ప్రవేశించేందుకు సాధ్యాసాధ్యాలపై అంతర్గతంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని సంజీవ్‌ చెప్పారు.

బిల్ట్‌ యూనిట్‌ తెరవండి..
వరంగల్‌ సమీపంలో ఉన్న బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిల్ట్‌) యూనిట్‌ పునరుద్ధరణ చేపట్టాల్సిందిగా ఐటీసీ చైర్మన్‌ దేవేశ్వర్‌ను కేటీఆర్‌ కోరారు. యూనిట్‌ తెరుచుకుంటే 2,000 మంది ఉద్యోగులకు తిరిగి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే ముందుకు వస్తామని ఈ సందర్భంగా దేవేశ్వర్‌ స్పష్టం చేశారు.  

ఆర్సేసియంలో కేటీఆర్‌..
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు టెక్నాలజీ సేవలు అందిస్తున్న యూఎస్‌ సంస్థ ఆర్సేసియం భారత్‌లో అడుగుపెట్టి మూడేళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇండియా ఫెసిలిటీలో జరిగిన వేడుకలకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూయార్క్‌లో ఉన్న ఆర్సేసియం పేరెంట్‌ కంపెనీ డి.ఈ.షా గ్రూప్‌ కార్యాలయాన్ని 2015లో తాను సందర్శించానని, హైదరాబాద్‌లో కంపెనీ ఫెసిలిటీ ఏర్పాటుపై చర్చించినట్టు గుర్తు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top