జేఎంసీ- పేజ్‌.. భారీ లాభాల ఫేజ్‌లో..

JMC Projects- Page industries jumps on positive news flow - Sakshi

Q4 ఫలితాలు వీక్‌- 2020లో భారీ క్యాష్‌ ఫ్లో

9 శాతం దూసుకెళ్లిన పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు

రూ. 938 కోట్ల విలువైన తాజా కాంట్రాక్టులు

14 శాతం జంప్‌ చేసిన జేఎంసీ ప్రాజెక్ట్స్‌ షేరు

వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి వెనకడుగు వేస్తున్నాయి. డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 86 పాయింట్లు నీరసించి 35,345కు చేరగా.. 26 పాయింట్లు తక్కువగా నిఫ్టీ 10,448 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా జాకీ బ్రాండ్‌ దుస్తుల కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌, మౌలిక సదుపాయాల సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలత్ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

జేఎంసీ ప్రాజెక్ట్స్‌ ఇండియా
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి రూ. 938 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు నిర్మాణ రంగ కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తాజాగా వెల్లడించింది. వీటిలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రూ. 841 కోట్ల విలువైన నీటి పారుదల ప్రాజెక్టులను సంపాదించగా.. బిల్డింగ్‌ నిర్మాణం కోసం దక్షిణాది నుంచి రూ. 97 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ తొలుత ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 60 ను అధిగమించింది. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 58 వద్ద ట్రేడవుతోంది.  గత 5 రోజుల సగటు 29,000 షేర్లతో పోలిస్తే తొలి రెండు గంటల్లోనే లక్ష షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ షేరు 65 శాతం ర్యాలీ చేయడం విశేషం!

పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ జాకీ బ్రాండ్‌ ఇన్నర్‌వేర్‌ తయారీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 20,929 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,194 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 31 కోట్లకు పరిమితంకాగా.. ఆదాయం 11 శాతం వెనకడుగుతో రూ. 541 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు సైతం 9 శాతం పడిపోయి 10.7 శాతానికి చేరాయి. అయితే పూర్తిఏడాదికి కార్యకలాపాల ద్వారా 125 శాతం అధికంగా రూ. 517 కోట్ల  క్యాష్‌ఫ్లోను సాధించింది. దీంతో 2020 మార్చికల్లా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించడంతోపాటు... రూ. 117 కోట్ల నగదు నిల్వలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top