వేతనాలు పెంచకపోగా.. కోతపెట్టిన ఎయిర్‌లైన్స్‌

Jet Airways Asks Staff To Take Pay Cut Up To 25 Percent - Sakshi

ముంబై : ఇటీవల కాలంలో కంపెనీలు వేతనాలు పెంచకపోగా.. ఉద్యోగులకే ఎసరు పెడుతున్నాయి. వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయడమో లేదా వేతనాల్లో కోత పెట్టడమో చేస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఇదే బాటలో నడిచింది. తమ ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం వరకు కోత పెట్టింది. 25 శాతం వరకు తగ్గింపు వేతనాన్ని తీసుకోవాలని ఉద్యోగులను జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆదేశించినట్టు తెలిసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోందని... క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఖర్చులు పెరిగిపోయాయని ఎకానమిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. వీటిని రికవరీ చేసుకునేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టింది. 

ఆగస్టు నుంచి ఈ తగ్గింపు వేతనాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ అమలు చేస్తుందని ఎకానమిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. ఉద్యోగులు ఎవరైతే వార్షికంగా 12 లక్షల రూపాయల వేతనాన్ని ఆర్జిస్తున్నారో, వారి వేతనాల్లో 5 శాతం కోత పడనుంది. అంతేకాక కోటికి పైగా వేతనాన్ని ఆర్జించే వారి వేతనాల్లో 25 శాతం తగ్గించేస్తోంది. అయితే ఈ వేతన కోత ఎంత కాలం పాటు కొనసాగనుందో ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం కోత పెట్టిన ఈ మొత్తాన్ని తర్వాత రీఫండ్‌ చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. వేతనాల తగ్గింపుపై జెట్‌ ఎయిర్‌వేస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌, తమ స్టాఫ్‌తో సమావేశం ఏర్పాటు చేసింది. పైలెట్ల వేతనాలు కూడా 17 శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ వార్షిక వేతన బిల్లు రూ.3000 కోట్ల మేర ఉంటుంది. వేతనాల తగ్గింపుతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.500 కోట్లు ఆదా కానుంది. కాగ, గత నెలలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌, అదనంగా 75 సింగిల్‌-ఐసిల్‌ 737 మ్యాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ దిగ్గజం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ రూ.60,244 కోట్ల వరకు ఉంటుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top