
శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచ కుబేరుడిగా మళ్లీ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్‌నే నిలిచారు. ఫోర్బ్స్ సోమవారం విడుదల చేసిన ప్రపంచ బిలీనియర్స్ జాబితాలో 141.9 బిలియన్ డాలర్ల(రూ.9,69,673 కోట్లకుపైగా) సంపదతో బెజోస్ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ జూన్ 1 నుంచి బెజోస్ సంపద దాదాపు 5 బిలియన్ డాలర్ల పైగా పెరిగింది. గతేడాది కూడా ఈయనే బిలియనీర్ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ జెఫ్ బెజోస్‌నే అపర కుబేరుడిగా నిలిచారు. జెఫ్ బెజోస్ తర్వాతి స్థానంలో 92.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ ఈ జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించుకున్నారు. 82.2బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఆపిల్ తర్వాత అమెజాన్ ఉంది. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో అమెజాన్ దూసుకెళ్తుండటంతో బెజోస్ సంపద కూడా శరవేగంగా పెరుగుతోంది. కాగ, అమెరికాలో అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్ డాలర్లతో అమెజాన్ 8వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో టాప్ 100లో నలుగురు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. వారిలో ముఖేష్ అంబానీ, అజిమ్ ప్రేమ్‌జీ, లక్ష్మి మిట్టల్, శివ నాడర్ ఉన్నారు.