
బీజింగ్: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్ మా వెల్లడించారు. 420 బిలియన్ డాలర్ల (రూ.30,43,131 కోట్లు) ఈ–కామర్స్ దిగ్గజానికి తన తరువాత వారసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్ డే సేల్’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్ మా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపడతారని తెలియజేశారు.
2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. ఇక నుంచి భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు.