పన్ను ఆదాతో పాటు రాబడులు

Invesco India Tax Plan: Benchmark-beating tax saver - Sakshi

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్‌ ప్లాన్‌  

గత నెల రోజుల్లో మార్కెట్లలో భారీ పతనంతో ఇన్వెస్టర్లకు మంచి పెట్టుబడి అవకాశాలు అందివచ్చాయి. ఈ సమయంలో పెట్టుబడులపై మెరుగైన రాబడులకు తోడు, పన్ను ఆదా చేసుకోవాలని భావించే వారికి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్‌ ప్లాన్‌ పథకాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌తో పోటీ పడి మెరుగైన రాబడులను ఇస్తోంది. సెబీ ఫండ్స్‌ పథకాల్లో మార్పుల తర్వాత అంతకుముందు వరకు ప్రామాణిక సూచీగా బీఎస్‌ఈ 100 ఉంటే, ఆ స్థానంలో బీఎస్‌ఈ 200 వచ్చింది. ఇది మినహా పథకం పెట్టుబడుల విధానంలో మార్పు లేదు.  ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో చూసుకున్నా బెంచ్‌ మార్క్‌ కంటే రాబడుల్లో ముందే ఉంది. అన్ని కాలాల్లోనూ మంచి పనితీరుతో అగ్ర స్థాయి పథకాల్లో నిలిచింది.   

పనితీరు, పెట్టుబడుల విధానం 
మూడేళ్ల కాలంలో చూసుకుంటే రాబడుల విషయంలో ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్‌ ప్లాన్‌ బెంచ్‌ మార్క్‌ కంటే ఒక శాతం మేర వెనుకబడింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 12.2 శాతం రిటర్నులను ఇచ్చింది. ఇదే సమయంలో బెంచ్‌ మార్క్‌ వృద్ధి 13.5 శాతంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో రాబడులు 12.1 శాతంగా ఉండగా, ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 21.5 శాతంగా ఉన్నాయి. యాక్సిస్‌ లాంట్‌ టర్మ్‌ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్యాక్స్‌ షీల్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్‌ సేవర్‌ పథకాల కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఆటుపోట్ల మార్కెట్లలో నష్టాలు ఎక్కువ కాకుండా చూడటంపైనా ఈ పథకం ఫండ్‌ మేనేజర్లు దృష్టి సారిస్తుంటారు. 2008, 2011 మార్కెట్‌ పతనాల్లో నష్టాలను పరిమితం చేయడమే కాకుండా, విభాగం సగటు రాబడులను మించి 1.5–4 శాతం అధిక లాభాలను ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చి కరెక్షన్‌ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 95 శాతం నుంచి 98 శాతానికి పెంచుకుంది. అంటే క్యాష్, డెట్‌ పెట్టుబడులను తగ్గించుకుంది.  ఈ పథకం లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 75 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తుంది. అధిక రాబడుల కోసం మిగిలిన మేర స్మాల్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు కేటాయిస్తుంది. గడిచిన ఆరు నెలల కాలంలో రంగాల వారీగా పెట్టుబడుల్లో పెద్దగా మార్పులు చేయలేదు. విద్యుత్, ఇండస్ట్రియల్‌ క్యాపిటల్‌ గూడ్స్, ఫెర్టిలైజర్‌ స్టాక్స్‌లో పెట్టుబడులను మాత్రం విక్రయించింది. ఫెర్రస్‌ మెటల్‌ స్టాక్స్‌ను యాడ్‌ చేసుకుంది. బ్యాంకులు, ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్‌ రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 38 స్టాక్స్‌ ఉన్నాయి. కొని, వేచి చూడటం అనే విధానాన్ని అనుసరిస్తుంది. టాప్‌ 5 స్టాక్స్‌లో పెట్టుబడులు 34 శాతం మేర ఉండటం గమనార్హం. ఇంధనం, ఆటోమొబైల్స్, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది. ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్‌స్ట్రక్షన్‌ రంగాలకు ప్రాధాన్యం తగ్గించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top