క్యాన్సర్‌ చికిత్సకూ ఉందో పాలసీ..

Insurance policy to cancer - Sakshi

రూ.5 వేల నుంచి వార్షిక ప్రీమియం

రూ.25 లక్షలకు పైగా కవరేజీ

దేశంలో గుండె జబ్బుల తర్వాత అత్యధికంగా ప్రాణాలు తీస్తున్న వ్యాధి క్యాన్సర్‌. వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది కూడా. దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతుండగా .. 6 లక్షల మంది మరణిస్తున్నారు. 2035 నాటికి క్యాన్సర్‌ సోకే వారి సంఖ్య ఏటా 17 లక్షలకు, మరణించే వారి సంఖ్య 12 లక్షలకు చేరుతుందని అంచనా. ప్రధానంగా 30–69 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది.

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించినా కూడా ట్రీట్‌మెంట్‌ ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి. రూ.10–12 లక్షలకు పైగా చికిత్స వ్యయం ఉంటోంది. సమగ్రమైన హెల్త్‌ పాలసీ ఉన్నా.. దాని ద్వారా వచ్చే మొత్తం చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ చికిత్సకు చాలటంలేదు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఉన్నా.. వ్యాధి తీవ్ర స్థాయికి చేరితే తప్ప ప్రాథమిక స్థాయిల్లో చికిత్సకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకే ప్రత్యేకంగా క్యాన్సర్‌ చికిత్స కోసం ఉపయోగపడే బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి.

తక్కువ ప్రీమియం.. ఎక్కువ కవరేజీ..
సాధారణంగా క్యాన్సర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇస్తున్నాయి. 40 ఏళ్ల వ్యవధికి అత్యంత తక్కువగా ఏటా రూ.5,000–6,000 ప్రీమియం ఉంటోంది. సమ్‌ అష్యూర్డ్, వయస్సు మొదలైన అంశాలను బట్టి ప్రీమియం మారుతుంది. వెయివర్‌ ఆఫ్‌ ప్రీమియం, ఆదాయ ప్రయోజనం తదితర ఫీచర్లుంటాయి. ఉదాహరణకు 30 ఏళ్ల పురుషుడు 70 ఏళ్ల మెచ్యూరిటీ ఏజ్‌తో.. రూ. 25 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ పొందేందుకు ఏటా రూ.8,231 చెల్లించాలి. సాధారణంగా క్లెయిమ్‌ చేయని ప్రతి సంవత్సరానికి..  సమ్‌ అష్యూర్డ్‌ మొత్తం 10–15 శాతం మేర పెరుగుతుంది.

క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి పాలసీ మొత్తాన్ని దశలవారీగా పొందవచ్చు. ఉదాహరణకు.. పాలసీదారు క్యాన్సర్‌ బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలిన వెంటనే.. సమ్‌ అష్యూర్డ్‌లో 25 శాతం మొత్తాన్ని వారి ఖాతాలో జమచేస్తారు. ప్రాథమికంగా ఎదురయ్యే అడ్మిషన్‌ ఫీజు మొదలైన ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇతర శరీర భాగాలకు క్యాన్సర్‌ సోకిందని తేలిన పక్షంలో ఒకో భాగానికి సమ్‌ అష్యూర్డ్‌లో 20 శాతం మొత్తాన్ని చెల్లిస్తారు. అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉంటే కొన్ని ప్లాన్స్‌ 100 శాతం సమ్‌ అష్యూర్డ్‌ చెల్లించడంతో పాటు.. కొన్నాళ్ల ఆదాయం కింద సమ్‌ అష్యూర్డ్‌లో మరో పది శాతం మొత్తాన్ని అదనంగా కూడా అందిస్తున్నాయి.

ప్లాన్‌ తీసుకోవడం ఇలా ..
ఇతరత్రా బీమా పాలసీ మాదిరే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండిట్లో ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రపోజల్‌ ఫారంలో ఇచ్చిన వివరాల ఆధారంగా, వైద్య పరీక్షలేవీ లేకుండానే ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ పాలసీని జారీ చేస్తున్నాయి. అయితే, ఆరోగ్యానికి సంబంధించి ఏదీ దాచిపెట్టకుండా ఫారంలో వెల్లడించాలి. దీనివల్ల క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులుండవు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top