ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్‌

India-born Gita Gopinath appointed IMF chief economist - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్థిక వేత్తగా భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో రిటైరవుతున్న మౌరిస్‌ ఓస్ట్‌ఫెల్డ్‌ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఐఎమ్‌ఎఫ్‌ సోమవారం ఒక ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. భారత్‌లో పుట్టి, పెరిగిన గీతా... ప్రస్తుతం హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన ఆమె ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, వాషింగ్టన్‌ యూనివర్సిటీల నుంచి ఎమ్‌ఏ డిగ్రీలు సాధించారు.

2001లో ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్‌డీ పట్టా పొందారు. 2016లో ఆమె కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. మార్కెట్, ఉదారవాద విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆమెను ఆర్థిక సలహాదారుగా నియమించడాన్ని కొందరు కమ్యూనిస్టు నాయకులు తప్పుపట్టారు. కాగా ఆమె వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top