
పుత్తడి డిమాండ్ తగ్గింది!!
పసిడి డిమాండ్ భారత్‌లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 131 టన్నులుగా నమోదయ్యింది.
మే-జూన్‌లో దేశీయంగా రివర్స్ ట్రెండ్: డబ్ల్యూజీసీ
ముంబై: పసిడి డిమాండ్ భారత్‌లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 131 టన్నులుగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో పోల్చిచూస్తే. ఈ డిమాండ్ 18 శాతం పడిపోయింది. అప్పట్లో ఈ డిమాండ్ 159.8 టన్నులుగా ఉంది. డబ్ల్యూజీసీ భారత్ వ్యవహారాల ఎండీ సోమసుందరం వెల్లడించిన వివరాల్లో ముఖ్యమైనవి...
⇒ క్యూ2లో డిమాండ్ విలువ రూపంలో 8.7 శాతం తగ్గింది. రూ.38,890 కోట్ల నుంచి రూ.35,500 కోట్లకు చేరింది.
⇒ కొనుగోళ్లకు పాన్‌కార్డుల్ని తప్పనిసరి చేయటం, మూలం వద్ద పన్ను వసూలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం, గ్రామీణ డిమాండ్ బలహీనత సహా ధరలు పెరుగుదల, వర్తకుల సమ్మె డిమాండ్ భారీగా తగ్గడానికి కారణం.
⇒ ఆభరణాలకు డిమాండ్ 20 శాతం పడిపోయి 122.1 టన్నుల నుంచి 97.9 టన్నులకు చేరింది. ఆభరణాల డిమాండ్ విలువ రూపంలో చేస్తే ఈ రేటు 11 శాతం పడిపోయింది. రూ.29,720 కోట్ల నుంచి రూ.26,520 కోట్లకు దిగింది.
ప్రపంచవ్యాప్తంగా 15 శాతం అప్
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. పసిడి డిమాండ్ రెండవ త్రైమాసికంలో 15 శాతం పెరిగింది. ఈ కాలంలో 1,050 టన్నులుగా నమోదయ్యింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన పెట్టుబడుల డిమాండ్ దీనికి ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 910 టన్నులు.