భారత్‌ వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయ్‌! | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయ్‌!

Published Thu, Jul 6 2017 1:28 AM

భారత్‌ వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయ్‌!

ఐఎంఎఫ్‌ విశ్లేషణ
తొలగిన డీమోనిటైజేషన్‌ ఎఫెక్ట్,
కీలక సంస్కరణల అమలు కారణం


న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది.  పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావం తొలగిపోతుండడం, కీలక సంస్కరణల అమలు ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. అయితే కార్పొరేట్‌ రుణ భారం, బ్యాంకింగ్‌ మొండిబకాయిలు (ఎన్‌పీఏ)లు ఆందోళన కరమైన అంశాలుగా తెలిపింది. జూలై 7, 8 తేదీల్లో జర్మనీలోని హ్యామ్‌బర్గ్‌లో జీ–20 దేశాల నాయకులు సమావేశమవుతున్న నేపథ్యంలో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన విశ్లేషణా పత్రంతో కొన్ని ముఖ్యాంశాలు...

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ, అత్యంత జాగరూకత అవసరం. రికవరీ మరింత పటిష్టం కావడానికి విధానపరమైన చర్యలు అవసరం. ఉత్పాదకత వృద్ధిలో జోరు లేకపోవడం, ప్రపంచంలోని అన్ని దేశాల్లో తగిన వృద్ధి సంకేతాలు కనిపించకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశాలు.
భారత్, చైనా వంటి వర్థమాన దేశాల్లో సైతం వృద్ధి తీరు మరింత పటిష్టం కావాల్సి ఉంది.
భారత్‌తో పాటు ఇండోనేషియా, టర్కీ వంటి వర్థమాన దేశాల్లో కార్పొరేట్‌ రుణ భారం సమస్య తీవ్రంగా ఉంది. భారత్‌ విషయానికి వస్తే– ఎన్‌పీఏల సమస్య తీవ్రంగా కొనసాగుతోంది. ఇది ఆందోళనకరమైన అంశమే.
పలు దేశాల్లో ఆర్థిక అవకాశాల విస్తృతికి పరిమితులు ఉన్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విద్యా రంగంపై పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ నిధుల సక్రమ వినియోగం అవసరం. ఆయా అంశాలు వృద్ధి విస్తృతికి దోహదపడతాయి.

సవాళ్లు ఉన్నాయ్‌...
2017,18 సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి 3.5 శాతం ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు కొనసాగుతుండడం ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం.  రికవరీ పటిష్టానికి మరింత జాగరూకతతో కూడిన విధాన చర్యలు అవసరం. – క్రిస్టినా లెగార్డ్, ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

Advertisement
Advertisement