
వాషింగ్టన్: భారత్ అధిక వృద్ధి రేటు పటిష్టతకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మూడు సూచనలు చేసింది. 15 రోజులకు ఒకసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో శుక్రవారం ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ మాట్లాడుతూ చేసిన మూడు సూచనలనూ పరిశీలిస్తే...
♦ బ్యాంకింగ్ రంగ సంస్కరణలను కొనసాగించాలి. దీనితోపాటు మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతాంశం. దీనివల్ల రుణ వృద్ధి క్రెడిట్ ప్రొవిజనింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా వ్యవహారాల పటిష్టత కూడా ముఖ్యం.
♦ ప్రభుత్వ ఆదాయ–వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాలను తప్పకూడదు.ఈ విషయంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను సరళీకరించాలి.
♦ కార్మిక, భూ వ్యవహారాలకు సంబంధించి కీలక మార్కెట్లలో సంస్కరణలు ముఖ్యం. దీనితోపాటు వ్యాపార సానుకూల పరిస్థితులు పెరగాలి.