మహమ్మారితో ఎకానమీ అతలాకుతలం

IMF Cuts Indias Growth Projection In FY21 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్‌ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) షాకింగ్‌ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్‌ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్‌ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ ఒకటని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్‌ (-5.2), బ్రిటన్‌ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్‌ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్‌ -8 శాతం నెగెటివ్‌ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్‌, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి.

చదవండి : మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విధ్వంసంతో 1991లో సరళీకరణ అనంతరం భారత్‌లో తొలిసారిగా వృద్ధి రేటు కనిష్టస్ధాయికి పడిపోతుందని ప్రపంచ బ్యాంక్‌ సైతం వెల్లడించింది. దక్షిణాసియా ఆర్థిక దృక్కోణం నివేదికలో భారత్‌ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. మార్చి 31తో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు -3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, మహమ్మారి వ్యాప్తితో స్వల్పకాలంలోనే వృద్ధి రేటును అనూహ్యంగా తగ్గించామని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్‌ గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top