ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌ బెస్ట్‌

Hyderabad is the best compared to other metros - Sakshi

ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్‌ కల్చర్‌.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్‌ అడ్వాంటేజెస్‌!

సాక్షి, హైదరాబాద్‌: 2019 జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్‌ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి.

అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్‌ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్‌ జోన్‌ అభివృద్ధికి త్వరలోనే లుక్‌ ఈస్ట్‌ పాలసీని తీసుకురానుంది.

వినూత్న నిర్మాణాలతో స్వాగతం..
కాస్మోపాలిటన్‌ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్‌ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్‌ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్‌ లయన్‌ కిరణ్‌ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.

రెండేళ్లలో బెంగళూరు బీట్‌..
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్‌ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్‌ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్‌ ఎండీ ఎస్‌ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్‌ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్‌ చేయడం ఖాయమని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top