కంపెనీల వేటలో హీరో మోటో | hunting for companies :hero moto | Sakshi
Sakshi News home page

కంపెనీల వేటలో హీరో మోటో

Oct 1 2013 1:18 AM | Updated on Sep 1 2017 11:12 PM

టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ విస్తరణ దూకుడును కొనసాగిస్తోంది. అంతర్జాతీయ విస్తరణ వ్యూహాంలో భాగంగా టూ వీలర్ల కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు


 మకావూ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ విస్తరణ దూకుడును కొనసాగిస్తోంది. అంతర్జాతీయ విస్తరణ వ్యూహాంలో భాగంగా టూ వీలర్ల కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కొనసాగుతాయని కూడా పేర్కొన్నారు. తమ కంపెనీకి విలువ చేకూర్చే ఉత్పత్తులనందించే టూ-వీలర్ కంపెనీలను  కొనుగోలు చేస్తామని వివరించారు. పెట్టుబడులకేమీ ఢోకా లేదని, వాటిని సరైన కారణాలకే వినియోగించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా కంపెనీ వద్ద రూ.3,500 కోట్ల నగదు నిల్వలున్నట్లు అంచనా.
 
 రూ.60 వేల కోట్ల టర్నోవర్
 జపాన్ కంపెనీ హోండాతో భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత హీరోమోటోకార్ప్ విదేశాల్లో విస్తరించడం, టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగానే అమెరికాకు చెందిన ఈబీఆర్ కంపెనీలో 49.2% వాటాను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇంజిన్‌లు అభివృద్ధి చేసే ఏవీఎల్ కంపెనీతో, ఇటలీకి చెందిన టూవీలర్ డిజైన్ సంస్థ ఇంజిన్స్ ఇంజినీరింగ్‌తో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది.  2020 కల్లా  50 దేశాల్లో విస్తరించడం, అంతర్జాతీయంగా 20 ప్లాంట్లను ఏర్పాటు చేయడం, రూ.60 వేల కోట్ల టర్నోవర్ సాధించడం తమ లక్ష్యాలని ఈ కంపెనీ ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించింది. ఈ  లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను పవన్ ముంజాల్  వ్యక్తం చేశారు.
 
 టూవీలర్లలో కార్ల టెక్నాలజీ
 కార్లలో ఉండే టెక్నాలజీని టూవీలర్లలోకి హీరోమోటొకార్ప్ తేనున్నది. ఇటీవల హీరోమోటోకార్ప్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫలితంగా రూపొందించిన కొన్ని వినూత్న ఫీచర్లను టూవీలర్లలో అందించనున్నది. కార్లలో వాడే ఇంజిన్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఇమ్మోబిలైజర్ వంటి అంశాలున్నాయి. ఇంజిన్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ అనే ఫీచర్(దీనినే మైక్రో హైబ్రిడ్‌గా కూడా వ్యవహరిస్తారు) ఎక్కువగా హై ఎండ్  కార్లు, ఎస్‌యూవీల్లో ఉపయోగిస్తారు. అవసరం లేనప్పుడు ఇంజిన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోయి, అవసరం ఉన్నప్పుడు ఆన్ అయ్యే ఈ ఫీచర్  కారణంగా మైలేజీ పెరగడమే కాకుండా కార్బన్ ఉద్గారాలు వెలువడడం తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ ఇమ్మోబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన కరెక్ట్ కీను వాడితేనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. 150 సీసీ బైక్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇక స్కూటర్లలో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్(ఐబీఎస్)ను అందించనున్నది. ముందు, వెనక రెండు చక్రాలకు ఒకటే బ్రేక్ ఉండడడం ఐబీఎస్ ప్రత్యేకత. ఈ ఫీచర్‌ను ప్లెజర్ స్కూటర్‌లో అందించనున్నారు.  వీటన్నింటిని తమ సొంత ఆర్ అండ్ డీ సెంటర్ అభివృద్ధి చేసిందని ముంజాల్ పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్లు కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త మోడళ్లను రూపొందిస్తున్నామని, వీటన్నింటిని వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement