ఒక ఫోన్‌... వెనక మూడు కెమెరాలు!!

Huawei P20 Pro and P20 Lite launched in India as Amazon exclusives - Sakshi

భారత్‌ మార్కెట్లోకి హువావే ‘పీ 20 ప్రో’

ధర రూ.64,999; లైట్‌ వెర్షన్‌ ధర రూ.19,999

మే 3 నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి  

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ప్రపంచపు తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ట్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ ‘పీ20 ప్రో’ను భారత్‌ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.64,999.

ఇందులో లైకా ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సిస్టమ్, కిరిణ్‌ 970 ప్రాసెసర్, ఈఎంయూఐ 8.1 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఓఎస్, అల్ట్రా–థిన్‌ బెజెల్స్, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

టాప్‌ రేటింగ్‌ 40 ఎంపీ రియర్‌ కెమెరా..
హువావే ‘పీ20 ప్రో’లో లైకా ట్రిపుల్‌ రియర్‌ కెమెరా వ్యవస్థను పొందుపరిచారు. ఇందులో 40 మెగాపిక్సెల్‌ ఆర్‌జీబీ సెన్సార్, 20 ఎంపీ మోనోక్రోమ్‌ సెన్సార్, టెలిఫోటో లెన్స్‌తో కూడిన 8 ఎంపీ సెన్సార్‌ అనే మూడు కెమెరాలుంటాయి. అలాగే 5ఎక్స్‌ హైబ్రిడ్‌ జూమ్, 960 ఎఫ్‌పీఎస్‌ సూపర్‌ స్లో మోషన్‌ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్‌లోని మరికొన్ని ప్రత్యేకతలు.

కంపెనీ ఈ ఫోన్‌లో 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అమర్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఈ హ్యాండ్‌సెట్‌ డీఎక్స్‌వో మార్క్‌ నుంచి యాపిల్, గూగుల్, శాంసంగ్‌ ఫోన్లను వెనక్కు నెట్టి మరీ అత్యధిక స్కోర్లను సొంతం చేసుకుంది. మొబైల్, సెన్సార్, లెన్స్‌ రేటింగ్‌కు డీఎక్స్‌వో మార్క్‌ ర్యాంకింగ్‌ను పరిశ్రమలో ప్రామాణికంగా తీసుకుంటారు. 

కంపెనీ ‘పీ20 లైట్‌’ అనే మరొక స్మార్ట్‌ఫోన్‌ కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999. ఈ రెండు ఫోన్లు మే 3 నుంచి అమెజాన్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top