బ్రిటిష్‌ ఆసియన్స్‌లో ధనిక కుటుంబం.. హిందూజా

Hindujas named richest British Asians in UK for fifth year - Sakshi

  వరుసగా ఇది ఐదవ ఏడాది  

లండన్‌: హిందూజా కుటుంబం బ్రిటన్‌లోని బ్రిటిష్‌ ఆసియన్లలో  అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది.  2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్‌ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ  తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదవ ఏడాది. నలుగురు సోదరులు– శ్రీచంద్‌ పీ హిందూజా, గోపీచంద్‌ పీ హిందూజా, ప్రకాశ్‌ పీ హిందూజా, అశోక్‌ పీ హిందూజా నేతృత్వంలో లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్‌– 2017లో వీరి కుటుంబ సంపద విలువను అంతక్రితం ఏడాదితో పోల్చితే 3 బిలియన్‌ పౌండ్లు పెంచింది. బ్రిటన్‌కు చెందిన ఆసియన్‌ మీడియా గ్రూప్‌ (ఏఎంజీ) ప్రచురించిన వార్షిక ‘ఆసియన్‌ రిచ్‌ లిస్ట్‌’ తాజా వివరాలను తెలిపింది.  

రెండవ స్థానంలో లక్ష్మీ మిట్టల్‌
జాబితాలో రెండవ స్థానం– ఇండియన్‌ స్టీల్‌ దిగ్గజం– లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌కు దక్కింది. ఆయన సంపద 14 బిలియన్‌ పౌండ్లు. 2016లో ఈ విలువ 12.6 బిలియన్‌ పౌండ్లు.  

ఐదవ స్థానంలో అనిల్‌ అగర్వాల్‌
►పెట్రోకెమికల్, టెక్స్‌టైల్స్‌ కంపెనీ– ఇండోరమా కార్పొరేషన్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ ప్రకాశ్‌ లోహియా 5.1 బిలియన్‌ పౌండ్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు.  
►నాల్గవ స్థానంలో 2.35 బిలియన్‌ పౌండ్లతో పాకిస్తానీ అన్వర్‌ పర్వేజ్‌ (బెస్ట్‌వే వ్యవస్థాపకులు) ఉన్నారు.   
►రిటైల్‌ దిగ్గజాలు సిమన్, బాబీ అండ్‌ రాబిన్‌ అరోరా, మెటల్‌ కింగ్‌ అనిల్‌ అగర్వాల్‌లు 2.3 బిలియన్‌ పౌండ్ల సంపదతో సంయుక్తంగా ఐదవ స్థానంలో నిలిచారు.  

సంపద మొత్తం 80.2 బిలియన్‌ డాలర్లు...
►దక్షిణాసియాలో మూలాలు ఉన్న 101 మంది బ్రిటన్‌ మిలియనీర్ల సంపద మొత్తంగా చూస్తే, 2017లో 80.2 బిలియన్‌ పౌండ్లు. 2016తో పోల్చితే ఈ సంపద 11 బిలియన్‌ పౌండ్లు పెరిగింది. వీరిలో మొదటి 10 మంది ప్రముఖ బ్రిటిష్‌ ఆసియన్ల సంపద 54.25 బిలియన్‌ పౌండ్లు. మొత్తం సంపదలో ఇది 68 శాతం.  
►తాజా జాబితాను లండన్‌లో జరుగుతున్న 21వ వార్షిక ఆసియన్‌ బిజినెస్‌ అవార్డుల కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా... బ్రిటన్‌ ఆసియన్లు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుండటం గమనార్హం. 

ఐసీఐసీఐ బ్యాంకుకూ... 
ఈ అవార్డుల కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఆసియన్‌ బిజినెస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ది ఇయర్‌), హోటల్స్‌ వ్యాపారవేత్త జోగీందర్‌ సింగ్‌ (బిజినెస్‌మెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌), బ్రిటన్‌లో డిష్యూమ్‌ ఇండియన్‌ రెస్టారెంట్ల చైన్‌ చీఫ్‌ షామిల్‌ తక్‌రార్‌ (రెస్టారెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌)లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతుండటం గమనార్హం.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top