జీఎస్టీతో ఆటంకాల్లేవు..

GST will have a long-term impact on country's economy - Sakshi

ఆదాయం పెరిగితే  రేట్ల క్రమబద్ధీకరణ

కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు ఏడాది పూర్తవగా, ఈ కాలంలో నూతన పన్ను చట్టం కారణంగా ఎటువంటి సమస్యలు కలగలేదని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దీని ద్వారా పన్ను వసూళ్లు అధికమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక పన్ను ఆదాయంతో భవిష్యత్తుల్లో రేట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న జైట్లీ జీఎస్టీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

జీడీపీ వృద్ధి, వ్యాపార సులభ నిర్వహణ, వాణిజ్య విస్తరణ, భారత్‌లో తయారీపై జీఎస్టీ సానుకూల ప్రభావమే చూపించిందని జైట్లీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచించిన ‘ఒక్కటే పన్ను రేటు’ ఆలోచనను దోషపూరితమైనదిగా పేర్కొన్నారు. దేశ జనాభా అంతా ఒకే విధమైన అధిక వినియోగం కలిగి ఉంటేనే ఇది సాధ్యపడుతుందని వివరించారు. జీఎస్టీ గతేడాది జూలై 1 నుంచి అమల్లోకి రాగా తొలి ఏడాదిలో 1.14 కోట్ల వ్యాపార సంస్థలు నూతన పన్ను చట్టం కింద నమోదు చేసుకున్నాయి.

జీఎస్టీ అమలైన దేశాల్లో ప్రారంభంలో ఆటంకాలు ఎదురైన విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ నూతన పన్ను చట్టంతో ఇబ్బందులు ఎదురవుతాయని తాను సైతం భావించినట్టు జైట్లీ చెప్పారు. ‘‘అతిపెద్ద సంస్కరణ అయిన జీఎస్టీ కారణంగా ఆటంకాలు ఏర్పడతాయన్న మాట నా నోటి నుంచి కూడా వచ్చింది. ఎందుకంటే ఇది సర్దుకోవడానికి సమయం పడుతుంది కనుక.

కానీ ఏడాది అనుభవం తర్వాత, సాఫీగా నూతన పన్ను చట్టానికి మారడం చూస్తే, ప్రపంచంలో మరెక్కడా ఇలా సాధ్యం కాలేదు’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఏడాది కాలంలో జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థకు గట్టి ప్రయోజనాలే సమకూరాయన్నారు. అయితే, దీన్నుంచి ఇంకా పూర్తి ప్రయోజనాలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.   రానున్న రోజుల్లో జీఎస్టీని మరింత సరళంగా మార్చడం, పన్ను రేట్ల క్రమబద్ధీకరణ, మరిన్ని ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం వంటి చర్యలు ఉంటాయని అరుణ్‌ జైట్లీ తెలిపారు.

వసూళ్లను లక్ష కోట్లకు తీసుకెళతాం: అధియా
న్యూఢిల్లీ: జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.95,610 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖా కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.94,016 కోట్లు వసూలు కాగా, ఏప్రిల్‌లో వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, ప్రతి నెలా వసూళ్లను రూ. లక్ష కోట్లకు తీసుకెళ్లగలమన్న ఆశాభావాన్ని అధియా వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.89,885 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top