గిఫ్టా..? ఓ కార్డిచ్చేద్దాం!!

Growing Gift Card Culture - Sakshi

పెరుగుతున్న గిఫ్ట్‌ కార్డు సంస్కృతి

మార్కెట్‌ విలువ రూ.3,000 కోట్లు

2018–19లో 75 కోట్ల లావాదేవీలు

మెట్రోయేతర నగరాల్లోనూ డిమాండ్‌ జోరు

న్యూఢిల్లీ: వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా సందర్భాలకు ఏం గిఫ్టులివ్వాలనేది చాలా మందికి పెద్ద సమస్యే? దానిపై సందర్భాన్ని బట్టి అయితే ఇంట్లో వాళ్లతో, లేకుంటే స్నేహితులతో చర్చోపచర్చలు సహజం. ఇదిగో... ఈ పరిస్థితిని చూశాకే గిఫ్ట్‌ కార్డుల ట్రెండ్‌ మొదలయింది. అందరికీ వీటి గురించి అర్థమయ్యాక ఈ ట్రెండ్‌ బాగా జోరందుకుంది. ఈ ప్రీ–పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులు ఇటు కొనుగోలుదారులు.. అటు వ్యాపార సంస్థలు... ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ పెర్సిస్టెన్స్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా గిఫ్ట్‌ కార్డ్‌ మార్కెట్‌ ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2024 నాటికి 698 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. క్విక్‌సిల్వర్‌ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం దేశీ మార్కెట్‌ విలువ సుమారు 50–60 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరగనుంది. దేశీయంగా గిఫ్ట్‌ కార్డుల కొనుగోలుకు సంబంధించి 90 శాతం లావాదేవీలు మొబైల్‌ ద్వారా జరుగుతున్నాయని రీసెర్చ్‌ సంస్థల అధ్యయనాల్లో వెల్లడైంది. 

రూ. 3వేల కోట్ల మార్కెట్‌.
రిటైల్, కార్పొరేట్‌ కస్టమర్స్‌కు గిఫ్ట్‌ కార్డ్‌ సొల్యూషన్స్‌ అందించే క్విక్‌సిల్వర్‌ నివేదిక ప్రకారం.. 2018–19లో 75 కోట్ల పైచిలుకు గిఫ్ట్‌ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ మార్కెట్‌ పరిమాణం రూ.3,000 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేందుకే కాకుండా సొంతానికి కూడా గిఫ్ట్‌ కార్డులను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పెద్ద మార్కెట్‌ ప్లేస్‌లు, ఆఫ్‌లైన్‌ బ్రాండ్‌ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో గిఫ్ట్‌ కార్డుల లభ్యత దాదాపు మూడు రెట్లు పెరిగింది. ‘సంప్రదాయ బహుమతులతో పోలిస్తే గిఫ్ట్‌ కార్డులను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గిఫ్టుల కోసం షాపింగ్‌ చేయాలంటే బద్ధకించే వారు ఆఖరు నిమిషంలోనే వీటిని ఎంచుకునే వారు. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్‌ మారుతోంది‘ అని క్విక్‌సిల్వర్‌ సొల్యూషన్స్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతాప్‌ టీపీ తెలిపారు. బహుమతులు ఇచ్చేవారి ధోరణుల్లో మార్పులను ఈ ట్రెండ్‌ సూచిస్తోందని మోగే మీడియా చైర్మన్‌ సందీప్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా మనం ఇచ్చే గిఫ్టు అవతలివారికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది, అది వారికి కూడా ఇష్టమైనదేనా అన్నది మనకి కచ్చితంగా తెలిసే అవకాశాలు తక్కువ. అందుకే గిఫ్ట్‌ కార్డు రూపంలో ఇస్తే.. అందుకునేవారు తమకు కావాల్సినది కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు.  

కార్పొరేట్‌ ధోరణి.. 
సాధారణంగా గిఫ్ట్‌ కార్డుల మార్గాన్ని ఎక్కువగా కార్పొరేట్‌ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. దీంతో అమెజాన్‌ గిఫ్ట్‌కార్డ్స్‌ వంటి వాటికి కార్పొరేట్‌ మార్కెట్టే ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రమంగా రిటైల్‌ కస్టమర్స్‌ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా కాస్త వైవిధ్యమైన కార్డులను ప్రవేశపెడుతున్నాయి. అమెజాన్‌ స్టోర్‌లో తొలిసారిగా షాపింగ్‌ చేసేవారికి గిఫ్ట్‌కార్డులు అనువైనవిగా ఉంటాయని అమెజాన్‌ పేమెంట్స్‌ డైరెక్టర్‌ షరీక్‌ ప్లాస్టిక్‌వాలా తెలిపారు. భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, కర్ణాటకలోని దావణగెరె, మహారాష్ట్రలోని బీడ్‌ వంటి ప్రాంతాల్లో గిఫ్ట్‌ కార్డులకు మంచి డిమాండ్‌ ఉంటోందని ఆయన పేర్కొన్నారు. అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డులను కేవలం షాపింగ్‌కు మాత్రమే కాకుండా కరెంటు, నీటి బిల్లులు కట్టేందుకు, ఫ్లయిట్స్‌.. హోటల్‌ బుకింగ్స్‌ మొదలైన వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. 

35 ఏళ్ల లోపు వారే అధికం.. 
దేశీయంగా గిఫ్ట్‌ కార్డు యూజర్లలో 85 శాతం మంది 35 ఏళ్ల లోపు వయస్సుగలవారే. ఈ కార్డుల వినియోగంలో టాప్‌ 10 మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్, పట్నా, ఇండోర్, జైపూర్, ఆగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, కొచి, సోనిపట్, లక్నో ఉన్నాయి. ఈ నగరాల్లో వినియోగం మూడు రెట్ల నుంచి అయిదు రెట్ల దాకా పెరిగింది.

కొత్త సీసాలో.. 
ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న గిఫ్ట్‌ కార్డులు వాస్తవానికి గతంలోనూ ఉండేవి. అప్పుడవి గిఫ్ట్‌ చెక్కుల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్వరూపం మారింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దశాబ్దాలుగా గిఫ్ట్‌ చెక్కులు జారీ చేసేదని బ్రాండ్‌ బిల్డింగ్‌డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు అంబి పరమేశ్వరన్‌ తెలిపారు. షాపర్స్‌ స్టాప్, క్రాస్‌వర్డ్, లైఫ్‌స్టయిల్‌ వంటి సంస్థలు గిఫ్ట్‌ కార్డుల సంస్కృతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడిక ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ వోచర్లు.. మళ్లీ మార్కెట్‌లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

రిటైలర్లకు లాభం.. 
కొనుగోలుదారులకు గిఫ్ట్‌ కార్డులు సౌకర్యవంతంగానే ఉంటున్నాయి. అదే సమయంలో వీటిని అమ్మే రిటైల్‌ సంస్థలకు ఇవి లాభసాటిగా కూడా ఉంటున్నాయి. కార్డులన్నీ ప్రీ–పెయిడ్‌ కావడం వల్ల .. దాన్ని గిఫ్ట్‌గా అందుకున్న వారు కొనుగోళ్లు జరపడానికి ముందుగానే సదరు రిటైలర్ల ఖాతాలో డబ్బు చేరినట్లే. పైగా .. చాలా మటుకు కార్డుల విలువలో 60–90 శాతం దాకా మాత్రమే వినియోగం ఉంటోంది. ఇలా మిగిలిపోయిన మొత్తం అంతా గిఫ్ట్‌ కార్డులు జారీ చేసిన సంస్థలకు లాభమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top