బీపీసీఎల్‌ అమ్మకానికి గడువు పొడిగింపు

Govt extends BPCL bid deadline to July 31   - Sakshi

భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) ప్రైవేటీకరణకు బిడ్ల దరఖాస్తుకు మరోసారి  ప్రభుత్వం గడువు పొడిగించింది. దేశీయ రెండో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ బీపీసీఎల్‌ను సొంతం చేసుకోవడాని ఆసక్తిగల  బిడ్డర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. గతేడాది నవంబర్‌లో బీపీసీఎల్‌లో ఉన్న 52.98 శాతం  ప్రభుత్వ వాటా విక్రయానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులను మార్చి 7 నుంచి చేసుకోవచ్చని చెబుతూ తొలుత మే 2వ తేదీని ముగింపు గడువుగా ప్రకటించారు. అయితే కోవిడ్‌-19 విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో మార్చి 31న బిడ్ల దాఖలకు ముగింపు గడువును జూన్‌ 13వరకు పొడిగించారు. ఇప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో బిడ్ల దరఖాస్తుకు జులై 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(డీఐపీఏఎం) ప్రకటిస్తూ ఈ మేరకు  బుధవారం నోటీసును విడుదల చేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాకు సమానమైన 114.91 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచినట్లు డీఐపీఏఎం తెలిపింది.
 కాగా బీపీసీఎల్‌ నాలుగు రిఫైనరీలను నిర్వహిస్తోంది. అవి ముంబై(మహారాష్ట్ర), కొచి(కేరళ), బైన(మధ్యప్రదేశ్‌)నుమాలీఘర్‌(అసోం)లలో ఉన్నాయి. ఈ నాలుగు రిఫైనరీలలో ఏడాదికి 38.3 మిలియన్‌ టన్నుల చమురును శుద్ధిచేస్తారు. ఇది దేశ చమురు శుద్ధి సామర్థ్యంలో 15 శాతం అంటే 249.4 మిలియన్‌ టన్నులుగా ఉంది. బీపీసీఎల్‌కు దేశవ్యాప్తంగా 15,177 పెట్రోల్‌ పంప్స్‌,6,011 ఎల్‌పీజీ డిస్టిబ్యూటర్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటితో పాటు 51 ఎల్‌పీజీ బాటిలింగ్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేరు దాదాపు 5 శాతం లాభపడి రూ.328.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top