గూగుల్‌ ప్లస్‌కు గుడ్‌బై!! | Google Plus to close after bug leaks personal information | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ప్లస్‌కు గుడ్‌బై!!

Oct 10 2018 12:46 AM | Updated on Oct 10 2018 12:46 AM

Google Plus to close after bug leaks personal information - Sakshi

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌కి చెందిన సోషల్‌ మీడియా సైట్‌ గూగుల్‌ ప్లస్‌ మూతపడనుంది. సాఫ్ట్‌వేర్‌ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణం. ఒక బగ్‌ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్‌ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే, ఏ డెవలపర్‌కు కూడా ఈ బగ్‌ గురించి గానీ, అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) దుర్వినియోగం గురించి గానీ తెలుసనడానికి తగిన ఆధారాలేమీ కనిపించలేదని గూగుల్‌ తెలిపింది. అలాగే ఎవరి ప్రొఫైల్‌ డేటా కూడా దుర్వినియోగం అయిన దాఖలాలు కూడా కనిపించలేదని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం) బెన్‌ స్మిత్‌... ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు.

బగ్‌ను సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా అంతర్గతంగా నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు వెల్లడైనట్లు ఆయన వివరించారు. అయితే, గూగుల్‌ ప్లస్‌ను తక్షణం మూసివేయబోమని, 10 నెలల వ్యవధి ఉంటుందని స్మిత్‌ తెలిపారు. వచ్చే ఆగస్టునాటికల్లా ప్రక్రియ పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. ఈ లోగా తమ డేటాను ఏ విధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, వేరే యాప్స్‌లోకి పంపించుకోవచ్చు తదితర అంశాల గురించి యూజర్లకు తగు అవగాహన ఇవ్వనున్నట్లు స్మిత్‌ తెలిపారు.

పిక్సెల్‌ త్రీ విడుదల..
పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ సిరీస్‌లో గూగుల్‌ మంగళవారం పిక్సెల్‌ 3, పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ పేరిట కొత్త ఫోన్స్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో పిక్సెల్‌ 3 రేటు రూ. 71,000 నుంచి రూ. 80,000 దాకా ఉండనుండగా, పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ రేటు రూ. 83,000 నుంచి రూ. 92,000దాకా ఉంటుంది. ఇవి 64జీబీ, 128 జీబీ వెర్షన్లలో లభిస్తాయి. అమెరికా మార్కెట్లో అక్టోబర్‌ 19 నుంచి, భారత్‌ సహా మిగతా దేశాల్లో నవంబర్‌ 1 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

పిక్సెల్‌ 3 స్క్రీన్‌ 5.5 అంగుళాలు, 3 ఎక్స్‌ఎల్‌ తెర 6.3 అంగుళాలు ఉంటుంది. పిక్సెల్‌ 3 ఫోన్‌లో ముందువైపు రెండు కెమెరాలు ఉంటాయి. మరోవైపు, అమెరికా మిలిటరీ కంప్యూటింగ్‌ సిస్టమ్స్‌ను ఆధునికీకరించేం దుకు ఉద్దేశించిన పెంటగాన్‌ ప్రాజెక్టుకు బిడ్‌ చేయబోవడం లేదని గూగుల్‌ తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 10 బిలియన్‌ డాలర్లు. తమ ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాలకు ఈ కాంట్రాక్టు నిబంధనలు అనుగుణంగా లేవని గూగుల్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement