మసకబారుతోన్న ‘పసిడి’.. భారీగా తగ్గిన ధర

Gold Sales down despite rates Falling  - Sakshi

సాక్షి, అమరావతి : ప్రతి ఏడాది శ్రావణ మాసంలో బంగారం అమ్మకాలు గణనీయంగా ఊపందుకునేవనీ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని బంగారు ఆభరణాల తయారీదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా.. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన విధంగా దేశంలో ధరలు తగ్గకపోయినా గడచిన ఆరు నెలల్లో విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.2,325 వరకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన రూ.32,825 గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర ఆగస్టు 20 నాటికి రూ.30,500 తగ్గింది. ఇదే సమయంలో ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.29,250 నుంచి రూ.1,140 తగ్గి రూ.28,110 చేరుకుంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్‌ 11న 159 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ బంగారం ధర గత నాలుగు నెలల్లో పతనమవుతూ రూ.1,188 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2016–17 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 161 టన్నులుగా ఉన్న ఆభరణాల అమ్మకాలు.. ఈ ఏడాది ఇదే కాలానికి 148 టన్నులకు పడిపోయినట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఇంకా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటం, అధిక పన్నులు, రూపాయి విలువ పతనంతో ఇక్కడి ధరలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన రీతిలో తగ్గకపోవడంతో వినియోగదారులు కొనుగోళ్లు జరపడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో 30 శాతం పడిపోయిన అమ్మకాలు: గతంలో వెయ్యి రూపాయలు తగ్గితే చాలు కొనుగోళ్లు పెరిగేవని, కానీ ధరలు దిగివస్తున్నా అమ్మకాలు ఆ స్థాయిలో పెరగడం లేదని బులియన్‌ వ్యాపారులు వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 30 శాతం  క్షీణించినట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది శ్రావణ మాస సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 నుంచి  270 కిలోల వరకు ఆభరణాల అమ్మకాలు జరిగాయని.. కానీ ఈ ఏడాది 200 కిలోలు మించి జరిగే అవకాశం కనిపించడం లేదని ఏపీ గోల్డ్, డైమండ్‌ జ్యూయలెరీ మర్చంట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బూశెట్టి రామ్మోహనరావు తెలిపారు. జీఎస్‌టీ, భారీ నగదు లావాదేవీలపై నిఘా వల్ల అమ్మకాలు తగ్గుతున్నాయా, లేక ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిందో అంచనాకు అందడం లేదన్నారు. ఈ సారి వరలక్ష్మీ పూజకు కేవలం కాసులు, రూపులు, కమ్మీలు వంటి వాటితో సరిపెడుతున్నారని తెలిపారు. ఈసారి వర్షాలు సకాలంలో రావడం కూడా బంగారం అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా చెపుతున్నారు.

రాష్ట్రంలో చాలాచోట్ల పొలం పనులు మొదలు కావడంతో అందరూ పెట్టుబడుల కోసం నిధుల వేటలో ఉండటం అమ్మకాలు తగ్గడానికి కారణంగా నరసరావుపేటకు చెందిన జ్యూవెలరీ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ రంగంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించడంతో చిన్న సంస్థల్లో అమ్మకాలు తగ్గిపోయాయని, ఇప్పుడు వారంలో రెండు రోజులకు మించి అమ్మకాలు ఉండటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విజయవాడకు చెందిన ఓ బులియన్‌ వ్యాపారి వాపోయారు. కార్పొరేట్‌ సంస్థలు కూడా ఈ ఏడాది అమ్మకాలపై పెదవి విరుస్తున్నాయి. భారీ వర్షాలు ఈసారి దక్షిణాదిలో ఆభరణాల అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు. ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉండటంతో కనీసం దీపావళి సమయానికైనా అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావంతో బంగారం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top