పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బాగా ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్‌మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది.
కొనసాగిన ఐటీ షేర్ల పతనం
* 58 పాయింట్ల నష్టంతో 26,847కు సెన్సెక్స్
* 12 పాయింట్ల నష్టంతో 8,132కు నిఫ్టీ
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బాగా ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్‌మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెప్టెంబర్‌లో చైనా దిగుమతులు 20 శాతం, ఎగుమతులు 3.7 శాతం పడిపోవడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు వరుసగా రెండో రోజూ నష్టాల పాలయ్యాయి. సెన్సెన్స్ 58 పాయింట్ల నష్టంతో 26,847 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,132 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఐటీ షేర్లకు నష్టాలు కొనసాగాయి. చైనా దిగుమతులు తగ్గాయన్న గణాంకాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవడంతో లోహ షేర్ల ర్యాలీకి అడ్డుకట్టపడింది. ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి పతనం... ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు నష్టాల్లో ముగిశాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ టెర్మ్‌ల్లో ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ తగ్గించడంతో ఐటీ షేర్ల పతనం కొనసాగింది.కాగా బీఎస్‌ఈలో 1,538 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగిశాయి. చైనా మినహా అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.