రూ.900కే రూ.2000 నోట్లు | Sakshi
Sakshi News home page

రూ.900కే రూ.2000 నోట్లు

Published Sat, Nov 18 2017 3:47 PM

Fake Rs 2000 notes from Pakistan at Rs 900 - Sakshi - Sakshi - Sakshi - Sakshi

దేశ రాజధానిలో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టయింది. నకిలీ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో తీసుకొస్తున్నట్లు నిందితుడి విచారణలో వెల్లడైంది. ఇతన్ని పశ్చిమ బెంగాల్‌ మాల్దాకు చెందిన కాషిద్‌గా పోలీసులు గుర్తించారు. ఐఎస్‌బీటీ ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో కాషిద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిఘా సంస్థల సమాచారంతో దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 6.6 లక్షల విలువైన 330 నకిలీ రూ.2000 నోట్లను గుర్తించారు. గత 15 ఏళ్లుగా తాను ఈ నకిలీ నోట్ల వ్యాపారం చేస్తున్నట్టు కాషిద్‌ చెప్పాడు.

ఢిల్లీ, యూపీ, బిహార్‌లకు ఈ నోట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. 100నోట్లను రూ.30 చొప్పున తాను ఈ నోట్లను కొనుగోలు చేసి ఆ తర్వాత రూ. 45 చొప్పున విక్రయిస్తానని తెలిపాడు. అయితే తాజా రూ. 2000 నకిలీ నోట్లను మాత్రం రూ. 900కు విక్రయించినట్లు పేర్కొన్నాడు. ఈ నోట్లను తాను పాకిస్థాన్‌ నుంచి తీసుకొస్తున్నట్లు కాషిద్‌ ఒప్పుకున్నాడు. పాక్‌కు చెందిన ఓ వ్యక్తి బార్డర్‌ ఫెన్సింగ్‌ నుంచి ఈ డబ్బులను భారత్‌ వైపు విసిరేస్తాడని చెప్పాడు. దీనిపై లోతుగా విచారణ చేపట్టామని.. ఇందులో పాక్‌ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చని పోలీసులు చెప్పారు. ఈ నోట్లు మెరుగైన క్వాలిటీతో, వాటర్‌మార్కులను కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నకిలీ నోటు, అసలైన నోటుకు మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టమన్నారు. 

Advertisement
Advertisement