డేటా లీక్‌: ఫేసుబుక్‌కు షాక్‌

Facebook Says Hackers Accessed Data Of 29 Million Users - Sakshi

డేటా హ్యాకింగ్‌ పై స్పందించిన ఫేస్‌బుక్‌

వాస్తవానికి 5 కోట్ల యూజర్ల డాటా లీక్‌

2.9 కోట్ల మందిది  మాత్రమే  పూర్తి డేటా లీక్‌

హ్యాక్‌ అయిన యూజర‍్లకు త్వరలోనే సమాచారం అందిస్తాం -ఫేస్‌బుక్‌

శాన్‌ ఫ్రాన్సిస్కో: కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా కుంభకోణంనుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాకింగ్‌ న్యూస్‌. శుక్రవారం స్వయంగా ఫేస్‌బుక్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం భారీ ఎత్తున వినియోగదారుల డేటా చోరీకి గురైంది. గత నెలలో  వార్తలొచ్చినట్టుగా 5కోట్ల మంది యూజర్ల కాకుండా  కేవలం 2.9 కోట్ల మంది ఖాతాదారుల‌ వ్యక్తిగత ఖాతాల పూర్తి సమాచారం హ్యాక్‌ అయిందని ధృవీకరించింది. దీంతో డేటా రక్షణ వ్యవహారంలో ఫేస్‌బుక్‌పై వినియోగదారులు, పెట్టుబడుదారుల  భరోసాను మరింత దిగజార్చింది.

ముఖ్యంగా యూజర్ల డేటా రక్షణలో కంపెనీ సమర్థత ప్రశ్నార్థకమైంది. మరోవైపు ఈ వార‍్తాలతో అమెరికా మార్కెట్లో ఫేస్‌బుక్‌ షేర్లు 2.6 శాతం క్షీణించగా, శుక్రవారం వివరాలను వెల్లడించిన తరువాత మరో 0.5 శాతం పడిపోయాయి. ఈ పతనం మున్ముందు మరింత  కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అభిప్రాయం

5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే. డిజిటల్ లాగ్-ఇన్ కోడ్లను హ్యాక్‌ చేయడం ద్వారా 5 కోట్లమంది వివరాలను  హ్యాకర్లు చోరీ చేసి ఉండొచ్చని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇటీవల చెక్‌–ఇన్‌ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని హ్యాకర్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఊహించిన దానికంటే తక్కువ మందిపైనే సైబర్‌దాడి ప్రభావం చూపిందని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్‌ తెలిపారు. ఒకసారి ఖాతాలోకి లాగిన్‌ అయ్యాక లాగౌట్‌ చేసి, మళ్లీ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే ‘యాక్సెస్‌ టోకెన్ల'ను దొంగిలించడమే ధ్యేయంగా గత నెల సైబర్ దాడులు జరిగాయని ఆయ‌న వివ‌రించారు.  ఎలాంటి వివరాలు లీక్‌ అయ్యాయి, అనుమానిత ఈమెయిల్స్‌ లాంటి వివరాలతో  రాబోయే రోజుల్లో ప్రభావిత యూజర్లకు మెసేజ్‌లను పంపుతానని , లేదా కాల్‌ చేస్తామని వెల్లడించారు.

ముఖ్యంగా 14 మిలియన్ల మంది వినియోగదారులకు సంబంధించి పుట్టిన తేదీలు, ఎంప్లాయిర్స్‌, విద్య, స్నేహితుల జాబితా హ్యాక్‌ అయ్యాయి. అయితే  సుమారు 15 మిలియన్ల మంది వాడుకందారులకు చెందిన కేవలం పేరు, కాంటాక్టుల వివరాలను మాత్రమే చోరీ చేయగలిగారని..ఆ మేరకు హ్యాకర్లను తాము నిరోధించగలిగామని  గై రోసెన్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top