దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

Even God can not change Infosys numbers says Chairman Nandan Nilekani - Sakshi

ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం

వ్యవస్థాపకులు, మాజీ ఉద్యోగులపై ఆరోపణలు హేయమైనవి...

ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని స్పష్టం చేశారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతిక విధానాలకు పాల్పడుతోందంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.  ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు.

భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని ఆయన తెలిపారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు.  

వివరాలు కోరిన ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ..
ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్సే్ఛంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్‌ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top