రూ.138 కోట్ల కనిష్క్‌ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ED Attaches Rs 138 Crore Assets Of Kanishk Gold - Sakshi

టీ.నగర్‌ (తమిళనాడు): చట్టవిరుద్ధ లావాదేవీల కేసులో కనిష్క్‌ సంస్థకు చెందిన రూ.138 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం జప్తు చేసింది. చెన్నై టీనగర్‌ నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డులో ఉన్న  కనిష్క్‌ నగల దుకాణాన్ని నుంగంబాక్కం కొథారి రోడ్డుకు చెందిన భూపేష్‌కుమార్‌ జైన్‌ నడిపిస్తూ వచ్చారు. ఈ సంస్థ నగల నిల్వలను అధికంగా చూపి నకిలీ పత్రాలతో 14 బ్యాంకుల్లో రూ.824.15 కోట్ల రుణాలు పొందారు. ఈ రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని, బకాయిలను గత ఏప్రిల్, 2017 నుంచి చెల్లించలేదు. దీనిపై సీబీఐకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా భూపేష్‌ కుమార్‌ సహా ఆరుగురిపై గత మార్చిలో సీబీఐ కేసు నమోదు చేసింది. అలాగే కనిష్క్‌ సంస్థ, దాని డైరెక్టర్లు భూపేష్‌ కుమార్‌ జైన్, అతని భార్య నీటా జైన్, షేర్‌ హోల్డర్లు సహా ఆరుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ అధికారులు రూ.48 కోట్ల విలువైన నగల దుకాణాన్ని, బ్యాంకులో ఉన్న రూ.143 కోట్ల నగదును గత ఏప్రిల్‌లో జప్తు చేసి భూపేష్‌కుమార్‌ జైన్‌ను గత మే 25న అరెస్టు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top