ఆ ఉద్యోగులకు ముందే దీపావళి : బంపర్‌ ఆఫర్‌

Early festival for Zerodha staff with Rs 200 crore Esops - Sakshi

సాక్షి, బెంగళూరు : బెంగుళూరుకు చెందిన జెరోధా సెక్యూరిటీస్ తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన ఉద్యోగులకు రూ. 200 కోట్ల విలువైన ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఇసోప్) ను జెరోధా ఆఫర్ చేసింది. మొత్తం ఉద్యోగుల్లో 77 శాతం మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది.  తద్వారా  దీపావళి, దసరా పండుగ సంబరాన్ని ముందే వారి ముంగిటకు తీసుకొచ్చింది  జెరోధా.

ఎకనామిక్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 1100 మంది ఉద్యోగుల్లో 850మందికి ఈ షేర్లను కేటాయించామని  జెరోధా సీఈవో నితిన్‌ కామత్‌ ప్రకటించారు.  మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు వాటాలను  ఖచ్చితంగా ఉంచుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, మొదటి సంవత్సరం తరువాత 33 శాతం  షేర్లను  విక్రయించుకునే అవకాశాన్ని అందిస్తోంది.  ఈ ఇసోప్‌  షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ 30-50 కోట్ల రూపాయల నిధిని కేటాయించినట్టు చెప్పారు. తమ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనీ, ఉద్యోగుల స్థూల ఆదాయాలు, సేవల ఆధారంగా వాటాల కేటాయింపు జరిగిందన్నారు. తమ ఉద్యోగుల ఆకస్మిక ద్రవ్య అవసరాలను తీర్చడానికి ఈ షేర్లపై ఏడాది​కి 6-7 శాతం వడ్డీ అందిస్తామని కూడా కామత్ చెప్పారు.  అలాగే తక్షణమే కాకపోయినప్పటికీ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో పబ్లిక్ లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉందని  కామత్‌ వెల్లడించారు.

కాగా భాగస్వామ్య సంస్థగా 2010లో ఏర్పాటైన జెరోధా బ్రోకరేజ్‌ సంస్థ రిటైల్, సంస్థాగత బ్రోకింగ్, కరెన్సీ, కమోడిటీ,  మ్యూచువల్ ఫండ్స్, బాండ్‌ మార్కెట్లలో సేవలు అందిస్తుంది. తన విశిష్ష్ట సేవలు, డిస్కౌంట్లతో దేశీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థల్లో  టాప్‌లో ఉన్న ఐసీఐసీ సెక్యూరిటీస్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ఆరంభంలో  నెంబర్ 1 పొజీషన్‌లోకి  దూసుకు వచ్చింది.  దాదాపు 8.47 లక్షల ఇన్వెస్టర్లతో జెరోధా దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది. 2016 ఆర్ధిక సంవత్సరంలో జెరోధాకు 61,970 మంది కస్టమర్లు ఉండగా, 2019 ఆర్ధిక సంవత్సరం (9 నెలల కాలానికి ) ఆ సంఖ్య 84,7,016 కు చేరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top