ధీరేంద్ర కుమార్ ఇన్‌ఫ్రా ఫండ్‌ ఇంటర్వ్యూ | Dhirendra Kumar Infra Fund imterview | Sakshi
Sakshi News home page

ధీరేంద్ర కుమార్ ఇన్‌ఫ్రా ఫండ్‌ ఇంటర్వ్యూ

Sep 23 2013 1:13 AM | Updated on Sep 1 2017 10:57 PM

యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో 2009లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు దాని విలువ రూ. 59,000. నా సొమ్మును రికవరీ చేసుకోవడానికి మరో ఉత్తమమైన ఫండ్‌ను సూచించండి?

 యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో 2009లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు దాని విలువ రూ. 59,000. నా సొమ్మును రికవరీ చేసుకోవడానికి మరో ఉత్తమమైన ఫండ్‌ను సూచించండి?
 - అరవింద్, ఖమ్మం
 
 గత కొన్నేళ్లుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ థీమ్ హవా పనిచేయడం లేదు. 2005-07 మధ్యకాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం శిఖర స్థాయిలకు చేరింది. ఆ తర్వాత ఈ రంగం ప్రభ మసకబారింది. ఇక యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విషయానికొస్తే,  పోటీ స్కీమ్‌లతో పోల్చితే ఈ మ్యూచువల్ ఫండ్ పనితీరు బాగాలేదు. ప్రస్తుతానికి ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్ వన్ స్టార్‌గా ఉంది. ఈ ఫండ్ నుంచి వైదొలగి వేరే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. సరిగా పనిచేయని  ఫండ్‌లో కొనసాగడమంటే, మంచి పనితీరు కనబరుస్తున్న ఫండ్ నుంచి అవకాశాలు మిస్ అవుతున్నట్లే లెక్క. ఆయా రంగాలు బూమ్‌లో ఉన్నప్పుడే ఆయా రంగాలకు సంబంధించిన ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి.  ప్రభుత్వ వ్యయంపైనే మౌలిక రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతమున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అధికంగా ఉన్న వడ్డీరేట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఈ తరహా ఫండ్స్ నుంచి దూరంగా ఉండడమే మంచిది.
 
 మీరు గతంలో డీఎస్‌పీ మైక్రో క్యాప్ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చారు.  ఇప్పుడు దాని రేటింగ్ 3 స్టార్‌కు తగ్గిపోయింది. ఈ హఠాత్ డౌన్‌గ్రేడింగ్‌కు కారణమేమిటి?
 - యామిని, హైదరాబాద్,
 ఫండ్ పనితీరును బట్టే రేటింగ్ ఉంటుంది. ఈ తరహా మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరి ఫండ్స్ పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుని రేటింగ్ నిర్ణయిస్తాం. అంచనాలకనుగుణంగా ఉన్నందునే అప్పుడు ఆ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చాం. ఈ ఫండ్‌కు సంబంధించిన రికమండేషన్స్ వెల్లడించేటప్పుడు, ఈ కేటగిరి ఫండ్స్‌ల్లో ఇదే అత్యంత రిస్క్ ఉన్న ఫండ్ అని కూడా పేర్కొన్నాం. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే 2008, 2011 మార్కెట్ పతన కాలంలో ఈ ఫండ్ బాగా దెబ్బతిన్నది. ఇక ఈ ఏడాదిలో ఈ కేటగరీలో ఫండ్స్ సగటు నష్టం 12 శాతంగా ఉండగా, ఈ ఫండ్ 17 శాతం నష్టపోయింది. 2009లో ఈ కేటగిరి ఫండ్స్‌లో మూడో ఉత్తమ ఫండ్‌గా (116 శాతం రాబడి, ), 2010లో 44 శాతం రాబడులతో అత్యుత్తమ ఫండ్‌గా నిలిచింది. ఇతర మెజారిటీ ఫండ్స్‌తో పోల్చితే ఈ డీఎస్‌పీ మైక్రో క్యాప్ ఫండ్ మరింత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. అయితే దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫండ్ నుంచి మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
 
 నా వయసు 29 సంవత్సరాలు. వార్షిక జీతం 7.5 లక్షలు. ఇప్పటివరకూ నేనెలాంటి టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. కొటక్ ఈ ప్రిఫర్ టెర్మ్ ప్లాన్(రూ.35 లక్షల కవర్‌తో) తీసుకోవాలనుకుంటున్నాను. మొత్తం రూ.75 లక్షల కవర్ ఉండేట్లుగా 2, 3 స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా పెట్టుబడి వ్యూహం సరైనదేనా? కొటక్ పాలసీ ఉత్తమమైనదేనా? నా వ్యూహానికి తగ్గట్లుగా మరికొన్ని ఫండ్స్‌ను సూచించండి?
 - జాన్సన్, గుంటూరు
 చిన్న వయసులోనే టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వయసును బట్టే ప్రీమియంలు ఆధారపడి ఉంటాయి. ఎక్కువ వయసులో పాలసీ తీసుకుంటే, ఎక్కువ ప్రీమియం, తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలన్నీ తీరిపోయేదాకా మీ పాలసీ కవర్ కొనసాగాలి. మీకు అరవైఏళ్లు వచ్చేటప్పటికి, మీ ఆర్థిక బాధ్యతలన్నీ తీరిపోయే పక్షంలో మీరు 30 ఏళ్ల టర్మ్ పాలసీ తీసుకోవాలి. మీ ఆర్ధిక బాధ్యతలు తీరడానికి అంతకంటే ఎక్కువ సమయం పడితే, టర్మ్ పాలసీ వ్యవధిని పెంచాలి. ఇక కొటక్ ఈ- ప్రిఫర్డ్ అనేది ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. స్టెప్ అప్ ఆప్షన్ అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. స్టెప్ అప్ ఆప్షన్ అంటే, వివాహం, గృహ కొనుగోలు, బిడ్డ పుట్టడం వంటి ప్రత్యేక సందర్భాల్లో కవర్‌ను పెంచుకునే వెసులుబాటు లభించడం. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి అధిక రక్షణ అవసరం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి పాలసీనే. ఇక బీమా పాలసీలకు సంబంధించి డైవర్సిఫికేషన్‌ను పాటించడం ఉత్తమమైన విషయమే. కాకుంటే ఇది 2,3 పాలసీలకే పరిమితం చేయడం మంచిది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్2 ప్రొటెక్ట్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్ ఇవి రెండు కూడా పరిశీలించదగ్గ పాలసీలే. సింగిల్  ప్రీమియం ఆప్షన్‌ను మాత్రం ఎంచుకోవద్దు. ఇది కొంచెం ఖరీదైన విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement