ఫండ్‌ వ్యాపారానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గుడ్‌బై 

DHFL to Exit Its Mutual Fund Business - Sakshi

ప్రామెరికా అసెట్‌ మేనేజర్స్‌లో 50 శాతం వాటా విక్రయం

భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కే అమ్మకం

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా అసెట్‌ మేనేజర్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. జాయింట్‌ వెంచర్‌లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా ట్రస్టీస్‌ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్‌ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88 శాతం అనుబంధ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అడ్వైజరీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా ఉన్నాయి. మరోవైపు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా ట్రస్టీస్‌లో కూడా 50 శాతం వాటాలున్నాయి. వాటాల విక్రయానికి సంబంధించి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌లో భాగమైన పీజీఎల్‌హెచ్‌ ఆఫ్‌ డెలావేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అసెట్‌ మేనేజర్స్‌ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.129.74 కోట్ల ఆదాయం, రూ.7.76 కోట్ల లాభం ఆర్జించింది.

అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.109.67 కోట్లు కాగా.. లాభం రూ. 7.64 కోట్లు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ.. ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌తో కలిసి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరిట జీవిత బీమా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో ఈ జాయింట్‌ వెంచర్‌ సంస్థలో ప్రుడెన్షియల్‌ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంది. దేశీయంగా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు తీవ్రంగా నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్‌ వ్యాపారం నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తప్పుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌) డిఫాల్ట్‌తో మొదలైన ఈ నిధుల సంక్షోభం పలు ఎన్‌బీఎఫ్‌సీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. సెప్టెంబర్‌  నుంచి చూస్తే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు ఏకంగా 68% క్షీణించాయి. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 213.90 వద్ద క్లోజయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top