ధనవంతులుగా మారడం కేవలం అదృష్టం లేదా అధిక జీతం వల్ల మాత్రమే సాధ్యం కాదు. నిరంతర కృషి, తెలివైన ఆర్థిక నిర్ణయాలు, కొంతమందికి తెలియని ఆర్థిక రహస్యాలు తెలుసుకొని వాటిని అనుసరించడం వంటివి ఉంటాయి. భారీగా డబ్బు సంపాదించే వారు పాటించే కొన్ని ఆర్థిక రహస్యాలను తెలుసుకుందాం.
ముందు పెట్టుబడి తర్వాతే ఖర్చు
సామాన్య ప్రజలు జీతం వచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బును పొదుపు చేస్తారు. కానీ ధనవంతులు దీనికి పూర్తి విరుద్ధమైన సూత్రాన్ని పాటిస్తారు. ముందే పొదుపు తర్వాతే ఖర్చు నియమాన్ని అనుసరిస్తారు. జీతం/ఆదాయం రాగానే తమ ఆర్థిక లక్ష్యాల కోసం నిర్దిష్ట శాతాన్ని (ఉదాహరణకు 20% లేదా అంతకంటే ఎక్కువ) వెంటనే పెట్టుబడికి మళ్లిస్తారు. ఆ తర్వాతే మిగిలిన మొత్తంతో తమ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ కూడా ఈ సూత్రాన్నే సిఫార్సు చేస్తారు. ఇది ఖర్చులను నియంత్రించడమే కాక, ప్రతి నెలా సంపద సృష్టికి తప్పనిసరిగా నిధులు కేటాయించే క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.
అప్పులో మంచి-చెడు
అప్పు అంటేనే ఆర్థిక సమస్యలకు మూలం అని సామాన్యులు భావిస్తారు. కానీ ధనవంతులు అప్పును ఒక ఆర్థిక సాధనంగా ఉపయోగిస్తారు. మంచి అప్పు.. ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే అప్పు. ఉదాహరణకు, అద్దెకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడానికి తీసుకునే రుణం లేదా వ్యాపారం విస్తరణకు తీసుకునే రుణం. ఈ అప్పు ద్వారా వచ్చే ఆదాయం, రుణం వడ్డీ కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు.
చెడు అప్పు వినియోగ వస్తువుల కోసం లేదా త్వరగా విలువ తగ్గే వస్తువుల కోసం తీసుకునే అప్పు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన కార్ల ఈఎంఐలు, విలాసవంతమైన విహారయాత్రలకు తీసుకునే రుణాలు. ధనవంతులు ఇలాంటి చెడు అప్పులకు దూరంగా ఉంటారు.
సంపద సృష్టికి ఆదాయ మార్గాలు
సామాన్య ఉద్యోగులు కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై (ఉద్యోగం) ఆధారపడతారు. అందుకే వారి ఆర్థిక ఎదుగుదల పరిమితంగా ఉంటుంది. ధనవంతులు తమ ప్రధాన ఆదాయంతో పాటు అదనంగా కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వనరులను సృష్టిస్తారు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అద్దె ఆదాయం ఇచ్చే ఆస్తులు, రాయల్టీలు, లేదా ఒక సైడ్ బిజినెస్ వంటివి నిర్వహిస్తారు.
దీర్ఘకాలిక పెట్టుబడులు
త్వరగా ధనవంతులు అవ్వాలనే ఆశతో సామాన్యులు షార్ట్ కట్‌లు లేదా ఊహాజనిత పెట్టుబడుల్లో డబ్బును కోల్పోతారు. ధనవంతులు తక్కువ సమయంలో అధిక లాభాల కోసం వెంపర్లాడకుండా దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి పెడతారు. వారు పెట్టుబడి పెట్టే కంపెనీలు, ఆస్తుల గురించి లోతుగా పరిశోధన చేస్తారు.
వడ్డీపై వడ్డీ
దీర్ఘకాలంలో పెట్టుబడులను అలాగే ఉంచడం ద్వారా వారు కేవలం అసలుపై మాత్రమే కాక, అప్పటి వరకు వచ్చిన లాభాలపై కూడా రాబడిని పొందుతారు. ఇది సంపదను భారీగా పెంచే అసలైన రహస్యం.
ఆర్థిక అక్షరాస్యత, నిరంతర అభ్యాసం
డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ధనవంతుల ముఖ్య రహస్యం. ధనవంతులు ఎప్పుడూ ఆర్థిక అంశాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. వారు పన్ను నియమాలు, పెట్టుబడి పోకడలు, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిరంతరం అప్‌డేట్ అవుతారు. సరైన ఆర్థిక ప్రణాళికలు, పన్ను ఆదా వ్యూహాల కోసం వారు మంచి ఆర్థిక సలహాదారులను, అకౌంటెంట్లను నియమించుకుంటారు. ఇది వారి డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు


